TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాధ్యులను గుర్తించండి : హోంమంత్రి

Published on: Tue Jan 24, 2012 8:17AM

హైదరాబాద్‌ : అమలాపురంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో నిజమైన బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈమేరకు ఆమె ఆ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో చర్చించారు. దోషులను గుర్తించేందుకు అవసరమైతే ప్రత్యేక బృందాలను నియమించాలని ఆదేశించారు. అమలాపురంలో పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన అన్నారు.అమలాపురం సంఘటనపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మంత్రులు రఘువీరారెడ్డి, గీతారెడ్డి, విప్‌ కొండ్రుమురళి కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సంఘటనలో బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ,కఠిన చర్యలు తీసుకుంటామని వారు అనంతరం మీడియాకు తెలిపారు. దళిత సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో వ్యవహరించి, శాంతిభద్రతల స్థాపనకు సహకరించాలని కోరారు.

మరోవైపు.. అమలాపురంలో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. అంబేద్కర్‌ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేయడంతో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు.జిల్లా ఎస్పీ, ఏఎస్పీలు పరిస్థితిని సమీక్షించారు. లాఠీ చార్చి చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసేందుకు రామచంద్రాపురం డీఎస్పీని నియమించారు. అమలాపురంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.అలాగే, అమలాపురం ఘటనపై పరిస్థితిని వివరించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం వ్యవహారంపై వారిద్దరు చర్చించినట్టు సమాచారం.