తెలంగాణా పోరాటంలో అల్లూరి పాత్ర?!.. కిషన్ రెడ్డి సరి కొత్త చరిత్ర పాఠం
Published on: Sat Jun 4, 2022 4:21PM
పిల్లడు పాఠం తప్పు చదివితే తిట్టేవాళ్లు, వీలయితే నాలుగు తన్నేవాళ్లూ కనీసం అయిదుగురు వుంటారు. పెద్దవాళ్లే పొరపడితే?! అందులోనూ ఎర్రబొట్టు పెట్టుని రొమ్మువిరుచుకు తిరిగే బిజెపి మహానేత పొరబడితే? అది పొరబడటం కిందకి అస్సలు రాదు. ఎందుకంటే కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి గనుక. ఆయన చేసిన తప్పిదం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏడవ తరగతి పిల్లాడు చేయబోడు గనుక!
మొన్న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం ఏకంగా ఢిల్లీలో బిజెపి సర్కారు నిర్వహించింది. అదీ పర్యా టక శాఖ ఆధ్వర్యంలోనే. కొత్త రాష్ట్రాన్ని పోనీ ఇలాగయినా గౌరవిస్తున్నారనే యావత్ తెలంగాణా వాదులూ అనుకున్నారు. కానీ కేంద్రంలో పాలకులను, తమ పార్టీ అధినేత వద్ద మెప్పు పొందాలని కిషన్ కాస్తంత ఎక్కువగానే ఓవరాక్షన్ చేశారన్నది ఫోటో ఎగ్జిబిషన్ సందర్భంగా పాపం ఆయనే బయట పెట్టు కున్నారు.
ఒక గొప్ప సందర్భం గనుక తెలంగాణా రాష్ట్ర చరిత్ర సంబంధించి మంచి ఫోటో ఎగ్జిబిషన్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. మంచిదే. దాన్ని ప్రారంభించి తిలకించినది కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన్ను అతి ప్రసన్నం చేసుకోవడానికి కిషన్ బాగానే తాపత్రయపడ్డారు. కానీ ఆవేశం కాస్తంత కట్టలు తెంచుకుంది. అదీ చరిత్రలో చెప్పని సంగతీ సందర్భాన్ని కల్పించడం, దాన్ని పాపం అమిత్ షా చాలా అమాయకత్వంతో వినడం, ఫోటోలు చూడడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనీసం రెండునెలలు నవ్వుకోవడానికి వీలుకల్పించింది. ఏ కామెడీ కూడా ఇందుకు బాలాదూర్!
ఇంతకీ సంగతేమంటే, తెలంగాణా పోరాటంలో కొమురం భీమ్, రాంజీ గోండుతో కలిసి అల్లూరి సీతా రామరాజు కూడా పోరాడాడు అని వివరించి మరీ చెప్పడం. ఇంతకంటే అజ్ఞానం మరోటి వుంటుందా అని యావత్ తెలుగు ప్రజలూ అవాక్కయ్యారు. ఏ గుజరాతీవాడో అలా అంటే తెలంగాణ చరిత్ర తెలీదని అనుకోవచ్చు. పచ్చి తెలంగాణా ప్రాంతీయుడు, మీదు మిక్కిలి తెలంగాణా నుంచీ వెళ్లి, కేంద్రంలో మంత్రిగా వెలగ బెడుతున్నవాడూ అలా పాఠం చెబుతున్నట్టు అమిత్ షా కి వివరించడం చాలా దారుణం. ఏమాత్రం క్షంతవ్యం కాదు. పుట్టి పెరిగిన తెలంగాణా సంబంధించిన చరిత్ర తెలిసి అల్లూరిని తెలంగాణా పోరాట యోధులలో ఒకడిగా చెప్పడం అసలు కిషన్ రెడ్డికి తెలంగాణా చరిత్ర గురించి మాట్లాడే అర్హత వుందని ఎలా అనుకోవాలి? చిత్రమేమంటే, పొరబాటో, అమిత్ షా వంటి మహానాయకునితో ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్న ఆనందంలోనో, అసలు ఢిల్లీలో తన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ దినో త్సవం నిర్వహించానన్న రెట్టించిన ఉత్సాహంతోనో తుళ్లి మరీ అన్న మాట కాదు. చాలా స్పష్టంగా తన అజ్ఞానాన్ని తానే ప్రదర్శించుకోవడమే!
టీచర్లు ఏది బడితే అది బోధించరు. చరిత్రకు సంబంధించిన అంశాలు ..అసలా మాటకు వస్తే ఏద యినా.. ఇంత దారుణంగా మార్చి చెప్పగలిగిన బోధకుడు కిషన్ రెడ్డి మాత్రమే. ఈయనకు కాలేజీలో పాఠాలు చెప్పినవారు, పోనీ తెలంగాణా స్నేహితులు నైజాం వ్యతిరేక పోరాటంలో అల్లూరి ప్రస్థావన తెచ్చి వుంటారని బుద్ధి జీవులెవరూ లేశ మాత్రం కూడా అంగీకరించరు. అసలు అదెలా సాధ్యమన్న చిన్నపాటి ఆలోచన కూడా లేకపోవడం బుద్ధిహీనతే అవుతుంది.
బిజెపి మంత్రులు, నాయకులు దేశ, ప్రాంతీయ భక్తి రసం కాస్తంత అధికమొత్తంలో తీసుకుంటు న్నారన్నది కిషన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఎర్రటి పెద్ద బొట్టుపెట్టుకుని, రుద్రాక్షలు వేసుకుని హిందూత్వ ఉపన్యాలు అప్పజెప్పడం కొంత తగ్గించుకోవడం చాలా అవసరం. అమిత్ షాకి తెలంగాణా గురించి లేశ మాత్రం తెలిసి వుండకపోవచ్చు. కొమురం భీమ్ పేరు ఆనోటా, ఈ నోటా పోనీ విన్నాడే అనుకుందాం.. కానీ ఏకంగా కేంద్ర మంత్రి, అందునా తెలంగాణా ప్రాంతీయుడు అయిన కిషన్ రెడ్డి చెప్పే తప్పుల సోది వినడం వారి ఖర్మం అనుకోవాలంతే!
పాపము శమించుగాక!


