కాంగ్రెస్ తో పొత్తు.. చంద్రబాబుకి తలనొప్పిగా మారనుందా?

 

తెలుగు రాజకీయాల్లో తలపండిన మేథావులు కూడా కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని ఊహించి ఉండరు. కానీ అనూహ్యంగా తెలంగాణలో ఈ రెండు పార్టీలు మహాకూటమితో దగ్గరయ్యాయి. దీన్ని కొందరు స్వాగతించగా.. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకేరించారు. అయితే మొదట చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలి అనుకోలేదు. తెరాసతో కలిసి నడుద్దాం అనుకున్నారు. కానీ తెరాస నుండి సానుకూల స్పందన రాకపోవడంతో మహాకూటమి వైపు అడుగులు పడ్డాయి. అదికూడా కాంగ్రెస్ పార్టీనే, టీడీపీతో పొత్తుకు ఉవ్విళ్లూరింది. టీడీపీలోని మెజారిటీ నాయకులు పార్టీని వీడినా పలు చోట్ల కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి 10 శాతం పైనే ఓటుబ్యాంకు ఉందని అంచనా. అందుకే కాంగ్రెస్, టీడీపీతో దోస్తీకి సిద్ధమైంది. కాంగ్రెస్ కి తెలంగాణలో బలం ఉంది కానీ ఇప్పటికిప్పుడు ఒంటరిగా బరిలోకి దిగి తెరాసను ఓడిస్తుందా? అంటే అనుమానమే. అందుకే కాంగ్రెస్ తమ బలానికి, టీడీపీ బలం తోడైతే తెరాసను ఈజీగా ఓడించవచ్చని భావించింది. పొత్తు దిశగా అడుగులు వేసింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు పొత్తు విషయాన్ని తెలంగాణ నేతలకే వదిలేసారు. ఇది కాంగ్రెస్ తో పెట్టుకున్నట్టు కాదు. తెరాసకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో భాగం అవుతామనే ఉద్దేశంతో టీడీపీ అంగీకరించింది. అయితే ప్రజల్లోకి ఇది కాంగ్రెస్ టీడీపీ పొత్తుగానే వెళ్ళింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం కొండంత ఉంది కానీ టీడీపీకి ఆవగింజంత కూడా లాభం లేదు. లాభం సంగతి అటుంచితే ఇంకా టీడీపీకి నష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ పొత్తు వల్ల భవిష్యత్తులో మరిన్ని తలనొప్పులు వచ్చేలా ఉన్నాయి.

 

 

 
తెలంగాణలో టీడీపీకి భారీ సంఖ్యలో నాయకులు లేకపోయినా.. ఓటుబ్యాంకు మాత్రం బాగానే ఉంది. సుమారు 40 స్థానాల్లో బలంగా ఉన్న టీడీపీ.. కేవలం కాంగ్రెస్ ఇచ్చే 10, 15 స్థానాల కోసం పొత్తుకు సిద్దమవ్వడం ఏంటంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేసున్నారు. ఒంటరిగా పోటీచేసినా ఆ 10,15 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ తో పొత్తు ఎందుకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు టీడీపీ అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని పేరుంది. అలాంటి టీడీపీ ఇప్పుడు అదే కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఏపీ టీడీపీ నాయకులు కూడా కాంగ్రెస్ తో దోస్తీని వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. దోస్తీ తెలంగాణకే పరిమితం.. ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ ఎప్పటికీ మన శత్రువే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. తెలంగాణలో పరిస్థితి వేరు. ప్రస్తుతం అక్కడ టీడీపీకి నాయకుల కొరత ఉంది. ముందు అక్కడ పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాలి. అందుకే కూటమిలో కలవాల్సి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేసున్నారట. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ తో దోస్తీ చంద్రబాబుకి తలనొప్పి తీసుకొచ్చి పెడుతుంది. ఓ వైపు ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెడుతూనే.. మరోవైపు తెలంగాణ దోస్తీ గురించి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తూ బుర్ర వేడెక్కుతుందట. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు టీడీపీ కూటమిలో భాగం కావడం మాకు కలిసొచ్చింది. ఈ దోస్తీ వల్ల కాంగ్రెస్ కి ఎంత లాభం ఉందో.. టీడీపీకి అంతే నష్టం ఉంటుందని అభిప్రాయపడుతున్నారట. చూస్తుంటే ఈ దోస్తీ మూలంగా చంద్రబాబుకి భవిష్యత్తులో మరిన్ని తలనొప్పులు తలుపుతట్టేలా ఉన్నాయి. చూద్దాం మరి చంద్రబాబు వీటి నుండి ఎలా బయటపడతారో ఏంటో.