రేణుకా చౌదరిపై టి.కాంగ్రెస్ ఎంపీల ఫిర్యాదు
Published on: Sat May 5, 2012 12:37PM
రాజ్యసభ సభ్యురాలు, ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకాచౌదరిపై తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రేణుకాచౌదరి తెలంగాణా పరిణామాలపై పార్టీ అధికారానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న అనుమానంతో వారు ఆమెను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్ తదితరులు పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్, పరిశీలకుడు వాయలార్ రవిని కలిసి రేణుకా చౌదరిపై పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి రేణుకా చౌదరి తెలంగాణాప్రాంతానికి చెందిన నాయకురాలు అయినప్పటికీ ఆమె సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాక తెలంగాణా ప్రజలను, తెలంగాణా ప్రజాప్రతినిథు లను రెచ్చగొట్టే విధంగా ఆమె వ్యవహరిస్తున్నారని వారు అంటున్నారు. ఆమె తన నోటిని అదుపు చేసుకోకపోతే జరిగే పరిణామాలకు తాము బాధ్యతా వహించబోమని పొన్నం ప్రభాకర్ గట్టిగా చెప్పినట్లు తెలిసింది. రేణుకా చౌదరిపై ఫిర్యాదులు విన్న గులాంనబీ ఆజాద్ ఈ విషయమై ఆమెతో కూడా మాట్లాడతాననీ, ఈ అంశంపై బహిరంగ విమర్శు చేయవద్దని కోరారు. అయితే టి.కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరిపై ఫిర్యాదు చేయటాన్ని ఆమె మద్దతుదార్లు తప్పుపడుతున్నారు. రాష్ట్రం ఇవ్వటంపై సాధ్యాసాధ్యాలు, సాధకబాధలు చూసుకోవాలని మాత్రమే రేణుకా చౌదరి అన్నారని, ఆమె మాటలను వక్రీకరించిన తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని వారు విమర్శిస్తున్నారు.


