చంద్రబాబు నివాసం కూడా ఖాళీ చేయాల్సిందేనట 

 

ప్రజావేదిక కూల్చివేత వ్యవహారం మీద ఏపీ పాలక ప్రతిపక్షాల మీద మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ మొదలు కాగా జగన్ ఆదేశాలతో నిన్న రాత్రంతా కొనసాగింది. ఇప్పటికే దాదాపు 80 శాతం పైగా భవనాన్ని నేలమట్టం చేశారు. అయితే ఈరోజు ఉదయం భారీ వర్షం కురవడంతో కూల్చివేత పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే కొద్ది సేపటి క్రితం ఈ వర్షం ఆగడంతో మళ్ళీ కూల్చివేత కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతలు ఈ వ్యవహారం మీద ఆందోళన చేసే అవకాశం ఉండడంతో ప్రజావేదికతో పాటు కరకట్ట ప్రాంతాన్ని మొత్తం భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. అయితే ఆ ప్రాంతానికి వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చంద్రబాబు మీదా, మాజీమంత్రి నారాయణ మీదా సంచలన ఆరోపణలు చేశారు. ప్రజావేదిక కట్టిన చోటు ఇద్దరు రైతులకి చెందిననదని దానిని బెదిరించి లాక్కున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాక ఈ ప్రజావేదిక మొదలు కరకట్ట మీద ఉన్న దాదాపు అరవై అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసం సహా వాటిని అన్నింటినీ కూడా త్వరలోనే పడగోడతామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబే స్వచ్చందంగా ఖాళీ చేయాలని లేదంటే ప్రభుత్వమే ఖాళీ చేయిస్తుందని ఆయన పేర్కొన్నారు.