అరకు అందాలపై ఓ లుక్కేయండి... ఉత్సవాలకు ముస్తాబవుతోంది...

ఆంధ్రా ఊటీ అరకు లోయ... ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ప్రకృతి అందాల స్వర్గథామం అరకులో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అరకు అందాలతోపాటు గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పేలా డిఫరెంట్స్ థీమ్స్‌‌‌ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పర్యాటకులను అలరించేవిధంగా అరకు వ్యాలీని మరింత అందంగా మెరుగులు దిద్దుతున్నారు.

ఆహ్లాదకరమైన వాతావరణం... పచ్చని కొండలు... అద్భుతమైన కొండ లోయలు... మన్యం సౌందర్యం.... చూడచక్కని సముద్ర తీరం... కళ్లు చెదిరే ప్రకృతి అందాలు... ఇలా చెప్పుకుంటేపోతే అరకు అందాలకు లెక్కే ఉండదు... అంత అత్యద్భుతంగా ఉంటుంది అరకు లోయ... అందుకే, పర్యాటకులు అరకుకు క్యూ కడుతూ ఉంటారు.... సహజసిద్ధ ప్రకృతి అందాలను చూస్తూ మైమరిపోతుంటారు... అరకు అందాలు ఎంతగా మురిపిస్తాయో... అంతే అమాయకంగా పర్యాటకుల మనసు దోచుకుంటారు అక్కడి గిరిజనులు.... గిరిజనుల జీవనశైలి.... వారి సంస్కృతి సంప్రదాయాలను పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి... అందుకే, గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించేలా ప్రతి ఏటా అరకు ఉత్సవ్ నిర్వహిస్తుంటారు. 

ఫిబ్రవరి 29, మార్చి ఒకటిన రెండ్రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవ్‌కు అరకు ముస్తాబైంది. గిరిజనుల సంప్రదాయ నృత్యం థింసా... అలాగే, కొమ్ము డ్యాన్సులతోపాటు అటవీ ఉత్పత్తులను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు. అలాగే, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే, అరకు ఉత్సవ్‌లో గతేడాది నిర్వహించిన హాట్ బెలూన్ ఫెస్టివల్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈసారి కూడా డిఫరెంట్స్ థీమ్స్‌‌తో పర్యాటకులను అలరించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

అయితే, అరకు ఉత్సవ్‌ కేవలం టూరిజం ప్రమోషన్స్‌... కోసమే కాకుండా.... గిరిజనులకు ప్రయోజనకరంగా... అలాగే, అడవి బిడ్డల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. అలాగే, అరకు ఉత్సవ్ పేరుతో కేవలం దేశ విదేశీయులకు ప్రాధాన్యత కల్పించకుండా, ఉత్సవానికి కారకులైన గిరిజనులకు పెద్దపీట వేస్తూ వాళ్లు లబ్ది జరిగేలా అన్ని విభాగాల్లో చోటు కల్పించాలని కోరుతున్నారు.