గేమ్ స్టార్ట్ చేసిన చంద్రబాబు..!!

విభజన సమస్యలతో పాటు ప్రత్యేకహోదాపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి చంద్రబాబు రెడీ అయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ డిమాండ్లకు కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించగా.. తాము ఏపీకి ఎంతో చేశామని కేంద్ర పెద్దలు.. ఏపీ బీజేపీలోని కొందరు నేతలు లెక్కలు చెబుతూ అధికారపక్షాన్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి వాటిలో ఆరితేరిపోయిన టీడీపీ అధినేత.. ఇక ఊపేక్షించి లాభం లేదని.. బీజేపీ-వైసీపీలకు ఏకకాలంలో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా ఏం చేయాలో.. ఎలా చేయాలో ఓ యాక్షన్ ప్లాన్‌ రెడీ అయిపోయిందట.

 

బడ్జెట్ చివరి విడత సమావేశాల తొలి రోజే టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్రవిభజన హామీలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అన్ని పార్టీలతో చర్చించి.. తగిన విధంగా ముందుకు వెళతామని ఆయన తెలిపారు. విభజన హామీలపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఎప్పటి నుంచో పలు పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

 

ఇప్పుడు చంద్రబాబు వారి డిమాండ్‌ను తీర్చడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు.. ఆల్ పార్టీ మీటింగ్‌ను ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రప్రయోజనాలు అంటూ వాదించే వారికి దీనిలో జాయిన్ అవ్వడం తప్ప వేరే దారి లేదు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సారథ్యంలో ఇది జరుగుతుంది కాబట్టి.. దీని విలువను అంత తక్కువగా అంచనా వేయరాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి వైసీపీ నేతలు కానీ.. ఏపీ బీజేపీ నాయకులు కానీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.