TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ తో పొత్తుకు సిద్ధపడుతున్న మజ్లీస్?

Published on: Sat Apr 7, 2012 6:34AM

ఒకప్పుడు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో అవగాహన కుదుర్చుకుని ఓల్డ్ సిటీలో ఏడు స్థానాల్లో గెలిచినా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లమీన్ (ఎం.ఐ.ఎం.) ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న జగన్ కు మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మునిగిపోయే నావలాంటిదని, దానితో ప్రయాణించడం పార్టీ పతనానికి దారితీస్తుందని ఒవైసీ సోదరులు భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి తోడు ఓల్డ్ సిటీతో పాటు రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో కూడా పార్టీ ఉనికిని పెంచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే 2014లో వచ్చే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని పార్టీతో జతకట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటే తెలంగాణా, రాయలసీమల్లో తమ అభ్యర్థులను నిలిపి కొన్ని స్థానాలనైనా కైవశం చేసుకోవచ్చుననేది ఎం.ఐ.ఎం. వ్యూహంగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో ముస్లీంల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ మజ్లీస్ అనేక సంవత్సరాలుగా ఓల్డ్ సిటీకే పరిమితమయింది. మతతత్వ పార్టీగా ముద్రవేసుకున్న ఈ పార్టీతో చేతులు కలపడానికి ప్రధాన పార్టీలేవీ సిద్ధంగా లేవు. దీంతో ఈ పార్టీ ఓల్డ్ సిటీ వెలుపల తన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణా, రాయలసీమల్లో కొన్ని సీట్లను గెలుచుకోవచ్చని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీ, తెలంగాణా రాష్ట్ర సమితి మధ్య ఎటువంటి ఎన్నికల పొత్తు కుదరకపోతే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రాంతంలో ఒంటరిగానే పోటీ చేయాల్సివస్తుంది. ఇలా ఒంటరిగా పోటీ చేసే బదులు కాస్తో కూస్తో ఓటర్లు, క్యాడర్ బలం ఉన్న ఎం.ఐ.ఎం.తో పొత్తు పెట్టుకుంటే కలిసి వస్తుందన్న భావనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.