రాష్ట్ర పరువును పొగొడుతున్న ఆంధ్రా అమ్మాయిలు..!!


ఉద్యోగాలు, వ్యాపారాలతో సహా అన్ని రంగాల్లోనూ మగాళ్లను పక్కకునెట్టి వాళ్ల కంటే దేనిలో తీసిపోమని మగువలు నిరూపిస్తున్నారు. అభివృద్ధిలో పురుషులకు ఏ మాత్రం తీసిపోమని చాటుతున్న మహిళలు అలవాట్లలోనూ ఓ అడుగు ముందుకేస్తున్నారు. ఆడవాళ్లు వంటగది నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పటి నుంచి స్వేచ్ఛగా నడుచుకోగలుగుతున్నారు. అదే క్రమంలో.. అభిరుచుల విషయంలోనూ.. అనుకున్నది చేయడంలోనూ ఏమాత్రం సిగ్గు పడటం లేదు. అది తప్పా.. ఒప్పా అన్న సంగతి పక్కనబెడితే.. మంచితో పాటే అన్ని దురలవాట్లకు చేరువవుతూ మగాళ్ల కంటే వేగంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

 

మద్యపానం, ధూమపానం, విచ్చల విడిగా శృంగారం, జూదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. గతంలో ఎన్నో కట్టుబాట్లు ఆడవారిని ఇలాంటి వాటికి దూరంగా వుంచేవి. అయితే మారుతున్న కాలంతో పాటే ఈ కట్టుబాట్లు సడలుతున్నాయి. చదువు, ఉద్యోగాల పేరిట తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో.. చెడు స్నేహాలకు అలవాటుపడి ఇరుగుపొరుగు చూస్తారన్న భయం లేకుండా మద్యాన్ని రుచి చూస్తున్నారు. ఒకటి, రెండు సార్లకు అనుకొని క్రమేపీ వాటికి బానిసలవుతున్నారు ఆడపడుచులు. తాజాగా జరిగిన జాతీయ కుటుంబ సర్వేలో మనదేశంలో మద్యం తాగే మహిళల శాతం పెరిగినట్లు తేలింది. ఈ జాబితాలో దేశంలోని 9 రాష్ట్రాలు అగ్రస్థానం కోసం కొట్టుకుంటున్నాయి. దురదృష్టవశాత్తూ ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉండటం.. రాష్ట్రానికి తలవంపులు తీసుకొస్తుంది.

 

2005-06వ సంవత్సరం నాటికి మద్యం సేవించే మహిళల శాతం 0.4గా ఉండగా.. 2015-16 నాటికి ఇది 0.7 శాతానికి పెరిగింది. అదే సమయంలో 2005-06లో మద్యం సేవించే పురుషుల శాతం 33.1 శాతం.. 2015-16 నాటికి 24.7 శాతానికి తగ్గడం విశేషం. కానీ అమ్మాయిలు మాత్రం చుక్క వేయకుండా ఉండలేకపోతున్నారట. మరోవైపు మద్యం అమ్మకాలు పెరగడం వెనుక రాష్ట్రప్రభుత్వాల ఏర్పాట్లు ఉన్నాయట. కొన్ని చోట్ల ప్రభుత్వాలే తాగండి.. తాగి ఊగండి అనేంతగా ప్రొత్సహిస్తున్నాయి. ఉదాహరణకు ఏపీని తీసుకుంటే.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక కష్టాల గురించి ఆ పరమాత్ముడికే ఎరుక. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో పాతపేరుతో కొత్త రాష్ట్రంగా ప్రస్థానాన్ని సాగించింది ఏపీ. కల్పతరువు లాంటి హైదరాబాద్‌ను కోల్పోవడంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.

 

దానిలో మొట్టమొదటిది మద్యం అమ్మకాలు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంత మంది తప్పు అన్నా.. దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలకు మద్యమే ప్రథమ ఆదాయ వనరు. అందుకు ఆంధ్రా కూడా మినహాయింపు కాదు. లిక్కర్ సేల్స్‌ను ప్రొత్సహించి ఆదాయాన్ని పెంచుకోవాలని భావించిన ఏపీ సర్కార్, బీరు-బారు పాలసీని ప్రవేశపెట్టింది. దానికి తోడు బీరు హెల్త్ డ్రింక్ అని స్వయంగా మంత్రివర్యులే సెలవివ్వడంతో యువత ఇక ఆగుతుందా..? తెగ తాగేసి రాష్ట్ర ఖజానా పెంచేసింది. తాజా సర్వే ప్రకారం వారిలో ఇప్పుడు అమ్మాయిలే పెద్దసంఖ్యలో ఉండటం సమాజాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఏది ఏమైనా ప్రతిభకు.. అందానికి.. తెలివితేటలకు.. పరాక్రమానికి ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు ప్రతీతి.. ఇలా వారు విచ్చలవిడిగా దురలవాట్లకు బానిసై తల్లిదండ్రులతో పాటు రాష్ట్రం పేరును చెడగొట్టొద్దని మనవి.