మందుని అందులో కలిపి తాగితే... ప్రమాదమే!


మద్యపానం ఆరోగ్యానికి హానికరం! అన్న హెచ్చరిక అన్నిచోట్లా కనిపిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా జనం పీపాల కొద్దీ మద్యాన్ని పట్టిస్తూనే ఉన్నారు. మన హీరోలు సైతం పనిగట్టుకుని ప్రతి సినిమాలోనూ మందు సన్నివేశంలో నటిస్తూనే ఉన్నారు. తాగితే తాగారు... కనీసం మోతాదుని పాటించమనీ, అందులో కలిపే పానీయాల విషయంలో జాగ్రత్త వహించమనీ సూచిస్తున్నారు నిపుణులు.

 

నీరు, సోడా వంటివాటితో కలిపి మద్యాన్ని పుచ్చుకోవడానికీ... కెఫిన్‌ అధికంగా ఉండే శీతలపానీయాలతో కలిపి పుచ్చుకోవడానికీ చాలా తేడా ఉందంటున్నారు. ఈ విషయంలో నిజానిజాలని నిరూపించేందుకు కెనడాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు నడుం కట్టారు. ఇందుకోసం వారు 1981 నుంచి 2016 వరకు జరిగిన ఓ 13 పరిశోధనల ఫలితాలను పరిశీలించారు.

 

మద్యం, కెఫిన్‌ రెండూ విరుద్ధమైన ఫలితాలని ఇస్తాయన్న విషయం తెలిసిందే! ఆల్కహాల్‌ మెదడుని మత్తులో ముంచితే, కెఫిన్‌ మనిషిని ఉత్తేజపరుస్తుంది. కానీ ఈమధ్యకాలంలో కెఫిన్‌ అధికంగా ఉండే ‘రెడ్‌బుల్‌’ వంటి ఎనర్జీ డ్రింక్స్ కలిపి మద్యం పుచ్చుకునే అలవాటు ఎక్కువవుతోంది. ఇక మౌంటెన్ డ్యూ వంటి శీతల పానీయాలలోనూ కెఫిన్‌ అధికంగానే ఉంటుంది. కెఫిన్‌కి తోడు వీటిలో చక్కెరలూ అధికంగానే ఉంటాయి. వీటిని మద్యంలో కలిపి తాగడం వల్ల, మనిషి మద్యం మోతాదుని దాటేస్తాడని కెనడా పరిశోధకులు తేల్చారు. ఒక పక్క శరీరం తూగుతున్నా, నిద్రపోకుండానే గడిపేస్తాడట. ఇలాంటి పరిస్థితి వల్ల తాగి గొడవపడటం, వాహనాలని నడపలేకపోవడం... వంటి పరిస్థితులూ తలెత్తే ప్రమాదం ఉంది.

 

మామూలుగానే కెఫిన్‌ను అధికంగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. కెఫిన్‌ పానీయాల వల్ల ఉద్వేగం ఎక్కువవుతుందనీ, రక్తపోటు పెరిగిపోతుందనీ, గుండె వేగం హెచ్చుతుందనీ హెచ్చరిస్తుంటారు. చిన్నపిల్లలు, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండాలని చెబుతారు. అలాంటిది కెఫిన్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలతో కలిపి మద్యాన్ని పుచ్చుకుంటే...

 

- నిర్జర.