TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తమ్ముడిని సీఎం పదవిలోకి రానివ్వను! 

Published on: Mon Jan 4, 2021 11:29AM

రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాలు పని చేయవంటారు. అధికారం కోసం కొంత మంది లీడర్లు ఎంతకైనా తెగిస్తుంటారు. సొంత మనుషులను కూడా కాదనుకుంటారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. కొందరు ముఖ్య నేతలు కూడా తమ కుటుంబ సభ్యుల నుంచే తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. కుటుంబ గొడవలతో తీవ్ర ఇబ్బందులు  పడ్డారు. కుటుంబ కలహాలతో మరి కొందరు నేతలు పదవులు కూడా పోగొట్టుకున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. అధికారం కోసం పావులు కదుపుతున్న డీఎంకే చీఫ్ స్టాలిన్ కు కుటుంబం నుంచే తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి.
    
నాలుగైదు నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా  వేగంగా మారిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేకే విజయావకాశాలు ఎక్కువని సర్వే సంస్థలు చెబుతున్నాయి.  అయితే ఆ పార్టీకి ఇప్పుడు  మాజీ ముఖ్యమంత్రి దివంగ‌త‌ క‌రుణానిధి కుమారుడు అళ‌గిరి పెద్ద అడ్డంకిగా మారుతున్నారనే చర్చ జరుగుతోంది. కలైంజర్‌ డీఎంకే పేరిట పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అళగరి. మదురైలో తన మద్దతుదారులతో  సమావేశం కూడా నిర్వహించారు. అంతేకాదు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న అళగరి.. తన తమ్ముడు స్టాలిన్ నే ఎక్కువగా  టార్గెట్ చేస్తున్నారు. 

తన త‌మ్ముడు స్టాలిన్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు అళగిరి. గ‌తంలో డీఎంకే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, అలాగే త‌న‌ను రాజకీయంగా అణ‌చివేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగినా తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. త‌న‌కు గ‌తంలో దక్షిణ తమిళనాడు పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవిని అప్పగిస్తే పార్టీకి విజ‌యాలు అందించాన‌ని చెప్పారు. కరుణానిధితో మాట్లాడి స్టాలిన్‌కు కోశాధికారి పదవి ఇప్పించాన‌ని తెలిపారు. తాను పదవుల కోసం ఎన్నడూ ఆశ‌ప‌డ‌లేద‌ని చెప్పారు అళగిరి. స్టాలిన్‌కు గ‌తంలో డిప్యూటీ సీఎం పదవి రావడంలో త‌న పాత్ర ఉంద‌న్నారు.  పార్టీ కోసం ఓ కార్యకర్తగా ఇంత‌గా శ్రమించిన తనను  ఏదో తప్పు చేసినట్టుగా చూశార‌ని చెప్పారు. స్టాలినే  త‌న‌ను డీఎంకే నుంచి బయటకు పంపించారని ఆరోపించారు అళగిరి. 

త‌మిళ‌నాడుకు ముఖ్య‌మంత్రి కావాలన్న ఆశతో స్టాలిన్‌ ఉన్నాడన్నారు అళగిరి.  అయితే  ఆ పదవిలోకి ఆయన వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. తాను ఏడేళ్లులుగా  మౌనంగా ఉన్నానని, ఇప్పుడు తాను ఏ నిర్ణయం తీసుకున్నా త‌న‌ మద్దతుదారులు త‌న వెంటే ఉంటార‌ని చెప్పారు.  అళగిరి పార్టీతో డీఎంకేకు నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. దక్షిణ తమిళనాడులో అళగిరికి మంచి పట్టు ఉందని, అక్కడ డీఎంకేకు భారీగా గండి పడవచ్చని అంచనా వేస్తున్నారు. అళగిరి పార్టీ ఏర్పాటు వెనక బీజేపీ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. యూపీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న డీఎంతే ఎట్టి పరిస్థిత్తుల్లోనూ అధికారంలోకి రాకుండా చూసేందుకు బీజేపీ పెద్దలు అళగిరితో పార్టీ పెట్టిస్తున్నారని చెబుతున్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్న స్టాలిన్ ఆశలకు.. ఆయన అన్న అళగిరే అడ్డంకిగా మారారనే చర్చ తమిళనాడులో జరుగుతోంది.