కొత్త పార్టీ యోచనలో అఖిలేష్ యాదవ్...

 

యూపీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ములాయం కుటంబంలో ఉన్న కుటుంబ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఎస్పీ అధినేత ములాయం సింగ్ తనయుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ములాయం ప్రకటించడం.. దానికి పార్టీ నేతల నుండి సైతం వ్యతిరేకత రావడం.. ఇక ఆతరువాత ములాయం మళ్లీ సీఎం అభ్యర్థిగా అఖిలేష్ యాదవే ఉంటాడని చెప్పడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీ నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చూస్తున్న అఖిలేష్ యాదవ్..ములాయంకు లేఖ రాయడం జరిగింది. తాను ఓకే అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని లేఖలో పేర్కోన్నారు. అయితే ఇప్పుడు ఎస్పీలో చీలిక తప్పదని.. త్వరలోనే ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్‌వాద్ పార్టీ’ పేరుతో కొత్త కుంపటి పెట్టేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగానే అంతా పూర్తి చేసి మోటార్ సైకిల్ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తలపై ములాయం ఎలా స్పందిస్తారో చూద్దాం...