అఖిలప్రియకి ఇంటిపోరు....తమ్ముడితో కూడా పోరాడాలా ?

 

కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గం గా పేరొందిన ఆళ్లగడ్డలో రాజకీయాలు పలు కీలక మలుపులు తిరుగుతున్నట్టు చెబుతున్నారు. తల్లి మరణంతో వైసీపీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరి తండ్రి మరణంతో మంత్రి పదవి దక్కించుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ స్థానం నుండి ఓడిపోయారు. గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్ర రెడ్డి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. 

ఆమె మాత్రమే కాక ఆమె సోదరుడు కూడా నంద్యాల నుండి పోటీ చేసి ఓడిపోవటంతో వారింట ముసలం పుట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నికల ముందే ఆమె మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ వీడి వైసీపీలో చేరిపోయారు. అలాగే సొంత బాబాయ్ గా భావించే సుబ్బారెడ్డి కూడా తనకు ప్రాధాన్యత తగ్గించిన క్రమంలో వారి కుటుంబానికి దూరం అయ్యారు. భూమా అఖిలప్రియ భార్గవ్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నాక భూమా కుటుంబంలో చీలిక వచ్చినట్టు సమాచారం. 

అఖిలప్రియ భర్త అన్నీ తానై వ్యవహరించడం కూడా భూమా వర్గీయులను దూరంగా జరగడానికి కారణమైందని అంటున్నారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కూతురిని వివాహం చేసుకున్న భార్గవ్ ఆ తర్వాత అఖిల ప్రియతో ప్రేమలో పడి ఆమెకి విడాకులు ఇచ్చి మరీ అఖిల ప్రియను పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఉంది. ఆ విషయం పక్కన పెట్టినా ఆమెను వివాహం చేసుకున్న నాటి నుండే మంత్రి భర్తగా ఆయన తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. 

అధికారిక పర్యటనలు మొదలు పార్టీ పర్యటనల దాకా అఖిల్ వెన్నంటే ఉండేవారు. ఇదే భూమా వర్గీయులకి కోపం తెప్పించిందట. భూమా తర్వాత భూమ వారసుడిగా జగత్ విఖ్యాత్ రెడ్డిని తెరమీదకు తేవాలని భూమా వర్గం భావిస్తోంది, కానీ అఖిలప్రియ భర్త హోదాలో భార్గవ్ తానే భూమా వారసుడిననేలా ప్రవర్తిస్తుండడంతో అఖిలప్రియకు బదులుగా భూమా వర్గాన్ని లీడ్ చేసేందుకు విఖ్యాత్ రెడ్డిని, అలాగే వీరికి సోదరుడు వరసయ్యే కిషోర్ రెడ్డిని తెరపైకి వచ్చారు. 

ఇప్పటికే వైసీపీలో గంగుల వర్గం ఉంది కాబట్టి, కిషోర్ రెడ్డి బీజేపీలో చేరి భూమా లీగసీని నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో అఖిలప్రియకు ఇప్పుడు ఆమె సోదరుడు కిషోర్ కుమారే పోటీ అని భూమా వర్గం భావిస్తుందట. విఖ్యత్ రెడ్డి ప్రస్తుతం చదువుకుంటున్నాడు, ఆయన లైన్ లోకి వచ్చే దాకా కిషోర్ రెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నారని అంటున్నారు.