అక్బరుద్దీన్ కు హైకోర్టులో ఊరట

 

Akbaruddin Owaisi, Akbaruddin Hate Speech, Hate Speech Asaduddin Owaisi

 

 

హిందువులు, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసికి హైకోర్టులో ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేయవద్దని అక్బరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కోర్టు దానిపై తీర్పు ఇచ్చింది. ఒక నేరానికి సంబంధించి వేర్వేరుగా ఎప్ఐఆర్‌లు దాఖలైనా, ఒకే సంస్థ దర్యాఫ్తు చేస్తుందని న్యాయస్థానం తెలిపింది. కేసులన్నీ ఒకటిగా చేసి సిఐడితో విచారణ జరిపించాలని ఆదేశించింది.

 

అక్బరుద్దీన్ ఓవైసీ అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగాను గత జనవరిలో అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను కొన్నాళ్లు జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుండి పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో పలువురు అక్బరుద్దీన్ పైన ఫిర్యాదు చేశారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు.