అక్బరుద్దీన్ ఓవైసి అరెస్టుకు రంగం సిద్ధం ?

 

 

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసి అరెస్టుకు రంగం సిద్దమయినట్లు తెలుస్తోంది. ఆరోగ్య కారణాలతో ఆయన నాలుగు రోజుల గడువు కోరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్యం పోలీస్ విచారణకు అనుకూలంగానే ఉందని వరంగల్ రేంజ్ ఐజి వెంకటేశ్వర్లు ప్రకటించారు.

 

దీనితో, ఇక అక్బర్ అరెస్టుకు అంతా సిద్దంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నడున తనకు నాలుగు రోజుల గడువు కావాలని తన నివాసానికి నిర్మల్ నుండి వచ్చిన పోలీసులకు ఆయన వివరించారు. వైద్యులు నేడు ఆయనకు మరిన్ని పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్య పరిస్థితి ఫై ఓ అవగాహనకు రావాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు మాత్రమే ఆయనకు మరింత గడువు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలనేది పోలీసుల ఆలోచనగా తెలుస్తోంది.

 

 

నిన్న నిర్మల్ పోలీసులు అక్బర్ ఇంటికి వచ్చి వెళ్ళిన కొద్ది సేపటికే హైదరాబాద్ నగర పశ్చిమ మండల డిప్యూటీ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు ఆయన ఇంటికి వచ్చారు. దీనితో, అక్బర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

ఆయన నివాసం వద్ద ‘పోలీస్ గొ బ్యాక్’ అంటూ ఎంఐఎం కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆయనను అర్ధరాత్రి అరెస్టు చేస్తారనే అనుమానంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అక్బర్ ఇంటి వద్దే ఉండిపోయారు.