కోర్టుల్నే బోనులో నిలబెడుతున్నారు కోందరు!

గత రెండు, మూడు రోజుల్లో రెండు కీలకమైన కోర్టు తీర్పులు వచ్చాయి. ఒకటి ఎన్ఐఏ కోర్టు వెలువరించిన అజ్మీర్ దర్గా పేలుళ్ల కేస తీర్పు. రెండు, గడ్చీరోలీ కోర్టు నుంచి వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా శిక్ష తీర్పు. ఈ రెండూ మీడియాలో ప్రధానంగా ప్రసారం అయ్యాయి. పేపర్లో చర్చింపబడ్డాయి. కాని, దాదాపు ఒకేసారి వచ్చిన ఈ రెండూ తీర్పుల్ని కలిసి చూసినప్పుడు మన దేశంలో కొనసాగుతున్న ఒక ట్రెండ్ మనకు కనిపిస్తుంది. అదే ఆందోళనకరమైంది...

 

మన దేశంలో నెహ్రు కాలం నుంచీ అభ్యుదయ భావాలు, సెక్యులర్ భావాలు రాజ్యమేలుతూ వస్తున్నాయి. అది నిజానికి మంచిదే. మైనార్టీలు మన దేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో మాదిరిగా కాకుండా భద్రంగా వుంటున్నారు. అభివృద్ధి చెందుతున్నారు. కాని, అదే సమయంలో రాజకీయాల్లో, మీడియాలో, యూనివర్సిటీల్లో ఇలా ప్రతీ చోటా హిందూ అన్న పదం వినబడగానే ముఖం చిట్లించే సంస్కృతి కూడా వుంటోంది. అసలు హిందూత్వ గురించి మాట్లాడిన వాడు ఆటోమేటిక్ గా మతోన్మాది అయిపోతాడనే బలమైన రూల్ అమల్లో వుంది. దానికి ప్రధాన కారణం ఓటు బ్యాంక్ పాలిటిక్స్. మైనార్టీ ఓట్ల కోసం రాజకీయ నేతలు ఒక వర్గాన్ని ఎంతదాకా అయినా వెళ్లి వెనకేసురావటం మొదలుపెట్టారు ఎప్పుట్నుంచో. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక రెండో రకం వారు కమ్యూనిస్ట్, లిబరల్ మేధావులు. వీరు కూడా మెజార్టీలైన హిందువుల్ని పెద్దగా పట్టించుకోరు. హిందూ సమాజాన్ని కులాల వారిగానే చూస్తారు వామపక్ష ఆలోచనపరులు. అదే సమయంలో ముస్లిమ్ లని అణిచివేయబడ్డవారిగా చూస్తారు. అది నిజమే అయినా మైనార్టీల్లో వుండే అతివాదుల్ని, ఉగ్రవాద సమర్థకుల్ని వీరు ఏ మాత్రం ఖండించిన దాఖలాలు వుండవు. ఇదే ఇంతకాలంగా కొనసాగుతోంది.

 

దేశంలో చాలా చోట్ల జరిగిన ఉగ్ర దాడుల నేపథ్యంలో కొందరు కరుడుగట్టిపోయిన హిందువులు అభినవ్ భారత్ పేరుతో ఒక సంస్థ స్థాపించి బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇంత వరకూ ఇది కోర్టుల్లో నిరూపితం కాలేదు. కాని, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ లాంటి వారు మాత్రం హిందు ఉగ్రవాదం అంటూ ఆరెస్సస్, బీజేపిల్ని కార్నర్ చేయటానికి వాడుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఎన్ఐఏ కోర్టు ఈ మధ్య వెలువరించిన తీర్పులో అజ్మీర్ దర్గా వద్ద బాంబు పేలుడు హిందూ ఉగ్రవాదుల పనేనని తేల్చింది. కాని, అదే సమయంలో ఛార్జ్ షిట్ లో పేర్కొన్న స్వామీ అసీమానంద్ , ఇంకా కొందర్ని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పుపై దేశంలో చాలా మంది పెదవి విరుస్తున్నారు. కోర్టు ముగ్గురు దోషులకు శిక్ష విధించిన దాన్ని స్వాగతిస్తూ హిందు ఉగ్రవాదం కూడా వుందని వారు అంటున్నారు. కాని, అదే సమయంలో సరైన ఆధారాలు లేక స్వామీ అసీమానంద్ ని విడుదల చేస్తే మాత్రం తప్పుబడుతున్నారు. ఇది ఆందోళనకరమైన పద్ధతి. ఎందుకంటే, కోర్టులు ఇచ్చే తీర్పుల్ని అందరూ గౌరవించాలి. పైకోర్టులో అప్పీల్ చేసుకునే వీలుంటే ఆ అవకాశాన్ని ఎలాగూ ఉపయోగించుకంటాం కాబట్టి కోర్టు తీర్పుల్ని అనవసరంగా విమర్శిస్తూ వ్యవస్థపై గౌరవం పోయేలా చేయకూడదు!

 

స్వామీ అసీమానంద్ ను నిర్దోషి అని తీర్పునిస్తే తప్పుబడుతోన్న వారే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను దోషిగా తేల్చితే కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టులు, మేధావుల వంటి వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని కుండబద్ధలు కొడుతున్నారు. పైగా ప్రొఫెసర్ సాయిబాబా వీల్ చెయిర్ కు పరిమితమైన వికలాంగుడని గుర్తుకు చేస్తున్నారు. ఆయన్ను కోర్టు వికలాంగుడని శిక్షించలేదు. నిషేధిత మావోయిస్టు పార్టీతో ఆయన సంబంధాలు పెట్టుకున్నారు. అంతే కాదు, విద్యార్థుల్ని తీర్చిదిద్దే బాధ్యతగల ప్రొఫెసర్  స్థానంలో వుంటూ హింసని నమ్మే నక్సలైట్స్ పట్ల సానుభూతి చూపుతున్నారు. ఆయన వల్ల ఎంత మంది విద్యార్థులు హింసాత్మక ఉద్యమం వైపు వెళ్లారన్నది ఎవరూ తేల్చలేని విషయం! ఇప్పటికే ఆయనతో పాటూ యావజ్జీవ శిక్ష పడ్డ వ్యక్తుల్లో ఒక విద్యార్థి కూడా వున్నాడు!

 

ప్రొఫెసర్ సాయిబాబాకు పై కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశం వుంటుంది. దాన్ని ఎవరూ కాదనరు. కాని, ఒక కోర్టు తీర్పు ఇవ్వగానే దానికి వ్యతిరేకంగా గళం విప్పటం.. వామపక్ష హింసకు మద్దతు పలికితే అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్టు మాట్లాడటం చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది సమాజంలో. ఈ ధోరణి కొంత మంది మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు మానుకోవాలి. హింస హిందూత్వవాదం నుంచి పుట్టినా, ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి పుట్టినా, వామపక్ష భావజాలం నుంచి పుట్టినా సమానంగా ఖండించాలి. కోర్టులు తీర్పునిస్తే మన సైద్ధాంతిక నేపథ్యలు, భావజాలాలు పక్కన పెట్టి అందరం గౌరవించాలి.