TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహా రాజకీయ దురంధరుడు.. అజిత్ దాదా..

Published on: Wed Jan 28, 2026 10:23AM

మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ దాదాగా సుపరిచితులైన అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరంగా, వ్యూహాత్మకంగా సాగింది. తన బాబాయి, మరాఠా దిగ్గజం శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, ప్రస్తుతం సొంత కుంపటి పెట్టుకుని మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానంలోని ప్రధాన మైలురాళ్లు ఏంటో చూస్తే.. 

1982లో ఒక సహకార చక్కెర కర్మాగారం బోర్డు సభ్యునిగా తన మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం 1991లో పుణే జిల్లా సహకార బ్యాంకు  చైర్మన్‌గా ఎన్నిక అవ్వడం, అదే ఏడాది బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందడం ద్వారా క్రీయాశీలం అయ్యింది.  శరద్ పవార్ కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అక్కడ నుంచి  రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పట్టు పెరిగింది.  1991 నుంచి బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. 

మంత్రిగా ఆయన వ్యవసాయం, విద్యుత్, నీటి వనరులు వంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేశారు.  మహారాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు ఆయన సొంతం. పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే, ఏకనాథ్ షిండే వంటి భిన్నమైన నేతల క్యాబినెట్‌లలో ఈ బాధ్యతలు నిర్వహించడం ఆయన రాజకీయ సమర్ధతకు నిదర్శనం.

2019 ఎన్నికల తర్వాత రాత్రికి రాత్రే బీజేపీకి మద్దతు ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజిత్. అయితే ఆ ప్రభుత్వం కేవలం 80 గంటలు మాత్రమే నిలవడం గమనార్హం.

2023 జూలైలో తన బాబాయి శరద్ పవార్‌కు షాక్ ఇస్తూ, మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు అజిత్ పవార్. కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)గా గుర్తించి, గడియారం  గుర్తును  కేటాయించింది.

ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 2024 నుండి ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నారు. టీవలి  మునిసిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, పవార్ కుటుంబంలోని రెండు వర్గాలు అజిత్, శరద్ పవార్..  తిరిగి కలిసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో  నడుస్తోంది. అజిత్ పవార్   దూకుడు స్వభావానికి, పరిపాలనా దక్షతకు పెట్టింది పేరు. ముఖ్యంగా పుణే, బారామతి ప్రాంతాల్లో సహకార సంఘాలపై ఆయనకు తిరుగులేని పట్టు ఉంది.

అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొంటున్నారు.