TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎయిర్‌కోస్టా కష్టం తీరినట్లే..

Published on: Tue Aug 9, 2016 3:43PM

ఎయిర్‌క్రాఫ్ట్ లీజుకు సంబంధించిన సమస్యలతో సంక్షోభంలో పడిన ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా తిరిగి కోలుకుంది. విమానాలు అద్దెకు ఇచ్చేవారితో చర్చలు విజయవంతంగా ముగియడంతో తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా బడా కార్పోరేట్ సంస్థలు, ఏవియేషన్ దిగ్గజాల గుత్తాధిపత్యంలో ఉన్న విమానయాన రంగంలోకి తెలుగు జెండాను రెపరెపలాడించింది ఎయిర్‌కోస్టా. పట్టణాల మౌలిక సదుపాయాలు, హోటళ్లు, విద్య తదితర రంగాల్లో ఇప్పటికే సేవలు అందిస్తున్న ఎల్‌ఈపీఎల్ సంస్థ సారథ్యంలో విజయవాడ కేంద్రంగా, దేశంలోనే తొలి ప్రాంతీయ విమాన సంస్థగా ఎయిర్‌కోస్టా ప్రారంభమైంది.

 

తొలుత రెండు ఈ-170, రెండు ఈ-190 ఎంబ్రేర్ జెట్ విమానాలను ప్రాంతీయ సర్వీసులుగా నడిపింది. తొలిదశలో విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, జైపూర్ నగరాలకు ...రెండవ దశలో పుణే, గోవా, మధురై, త్రివేండ్రం, విశాఖపట్నం నగరాలకు సర్వీసులను విస్తరించింది. అతి తక్కువ కాలంలో ప్రయాణికుల ఆదరణను చూరగొన్న ఎయిర్‌కోస్టా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది..అందుకోసం నేషనల్ క్యారియర్‌గా మార్పు చెందే ఉద్ధేశ్యంతో కేంద్ర పౌర విమానయాన శాఖకు దరఖాస్తు చేసుకుంది. దీనిపై డీజీసీఏ అనుమతి కూడా మంజూరు చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలో గత గురువారం ఎయిర్‌కోస్టా అన్ని సర్వీసులను రద్దు చేసింది. దీంతో మొత్తం 32 సర్వీసులు రద్దు అయ్యాయి.

 

ఎన్‌డీఏ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నూతన పాలసీలోని రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ప్రకారం..ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేందుకు నిరుపయోగంగా ఉన్న 350 ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌పోర్టులను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అలాంటిది ఉన్న విమానయాన సంస్థలే మూలన పడితే పాలసీకే విఘాతం కలిగే పరిస్థితి ఉండటంతో కేంద్ర పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగి లీజు దారులకు, ఎయిర్‌కోస్టా యజమాన్యానికి మధ్య రాజీ కుదర్చడంతో సంక్షోభం సమసిపోయింది. అచ్చం ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్న బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ పెగాసస్‌ విషయంలోనూ ఎయిర్‌క్రాఫ్ట్ లీజు దారులు సానుకూలంగా స్పందించడంతో ఆ సంస్థ కూడా తన సర్వీసులను పునరుద్ధరించింది.