గల్లంతైన విమానం ఎక్కడ.. చంద్రబాబు పరామర్శ..


తమిళనాడులో ఎయిర్ ఫోర్స్ విమానం నిన్న అదృశ్యమైన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 8.30 గంటలకు తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కొంతసేపటికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి గల్లంతైంది. విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ విమానం ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ నావికాదళాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. విమానం సముద్రంలో కూలిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సముద్ర ఉపరితలంపైనా సహాయక బృందాలు ఓ కన్నేసి గాలింపును మరింత ముమ్మరం చేశాయి. ఇక సముద్రంలో విమాన శకలాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ మత్స్యకారులకు సహాయక సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు.

 

మరోవైపు గల్లంతైన వారిలో మన తెలుగు రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన చిన్నారావు, నాగేందర్‌రావులు గల్లంతైన వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.