రాజధాని రాక ముందే విశాఖకు ఝలక్.. ఎయిర్ సర్వీసులు రద్దు చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ప్రజా జీవనంతో పాటు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత నెలకొన్న అనిశ్చితి కారణంగా కీలకమైన పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలతో పాటు పౌర విమానయానం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇప్పటికే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ సహా దేశీయంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పుడు పాలన రాజధానిగా ప్రభుత్వం చెప్పుకుంటున్న విశాఖ నుంచి కూడా తమ సర్వీసులను ఉపసంహరించుకునేందుకు ప్రైవేటు విమానయాన సంస్ధలు సిద్ధమవుతున్నాయి.

ఏపీలో ఎక్కువ మంది ప్రయాణికులు కలిగిన విమానాశ్రయంగా విశాఖ ఎయిర్ పోర్టుకు పేరుంది. పలు ప్రైవేటు విమానయాన సంస్ధలు ఇక్కడి నుంచి నిత్యం దేశ, విదేశాలకు సర్వీసులు నడుపుతుంటాయి. రాష్ట్రంలో ఉన్నంతలో రద్దీ విమానాశ్రయంగా చెప్పుకునే విశాఖ ఎయిర్ పోర్టుపైనా తాజా పరిస్ధితుల ప్రబావం పడింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఓ రకమైన అనిశ్చితి నెలకొంది. అమరావతి నుంచి పాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినా అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి విమానాలు నడుపుతున్న పలు ప్రైవేటు విమానయాన సంస్ధలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నిత్యం కోల్ కతాకు విమానాలు నడిపే ఎయిర్ ఏషియా సంస్ధ ప్రస్తుతం తాము నడుపుతున్న నాలుగు సర్వీసులను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. అదే కోవలో ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా చెన్నై, హైదరాబాద్ సర్వీసులను మార్చి నెల రెండో వారం నుంచి రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. మరో ప్రైవేటు విమానయాన సంస్ధ స్పైస్ జెట్ కూడా మార్చి నెలాఖరు నుంచి విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే సర్వీసును రద్దు చేయాలని నిర్ణయించింది.

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ వెళ్లే ఇండిగో సర్వీసులకు అనుమతి పొడిగించేందుకు నిరాకరించింది. దీంతో ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. అమరావతి అభివృద్ధి విషయంలో వైసీపీ సర్కారు వైఖరితో పాటు పారిశ్రామికంగా కూడా పురోగతి లేకపోవడంతో విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ప్రైవేటు ఆపరేటర్లు రద్దు చేసుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిపోతుంది కాబట్టి విజయవాడ ఎయిర్ పోర్టుకు ట్రాపిక్ తగ్గడంలో ఆశ్చర్యం లేదు. కానీ అనూహ్యంగా విశాఖ ఎయిర్ పోర్టుకు ట్రాఫిక్ తగ్గనుండటం కచ్చితంగా భవిష్యత్తులో పెను ప్రభావం చూపే అంశమే. అసలే ఈ ఏడాది జూన్ నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలని భావిస్తున్న వైసీపీ సర్కారుకు ఇప్పటికే భారీ పరిశ్రమలన్నీ రాష్ట్రం దాటి పోతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో విమానయాన సంస్ధలు కూడా తమ సర్వీసులు ఉపసంహరించుకుంటే రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, వారి ద్వారా వచ్చే పెట్టుబడుపైనా తీవ్ర ప్రభావం పడనుంది. విమానయాన సంస్ధల నిర్ణయాలపై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.