ఈస్ట్ ఇండియా కంపెనీ 2018

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కూటమిపై పలు పార్టీలు విమర్శలు చేస్తుండగా తాజాగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూటమిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును 'ఈస్ట్ ఇండియా కంపెనీ 2018'గా పోల్చారు.'తెలంగాణ మిశ్రమ సంస్కృతిని నాయుడు (చంద్రబాబు) కాపాడతారా? పోనీ కాంగ్రెస్ కాపాడుతుందా? ఇది మహాకూటమి కాదు...2018 ఈస్ట్ ఇండియా కంపెనీ' అని ఒవైసీ అన్నారు. తెలంగాణ ప్రజలే రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించుకుంటారని, ఎక్కడో నివసించే వ్యక్తులు కాదని అన్నారు. 'నాయుడు విజయవాడలో ఉంటారు. ఆర్ఎస్ఎస్ నాగపూర్‌లో ఉంటుంది. కాంగ్రెస్ ఢిల్లీలో ఉంటుంది. వీళ్లా తెలంగాణ, తెలంగాణ ప్రజల తలరాతను నిర్ణయించేది?' అని ఒవైసీ ప్రశ్నించారు. ఈ మోడ్రన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ్నించి వచ్చిందో అక్కడికి పంపించేలా డిసెంబర్ 7న ప్రజలు తీర్పునివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.