TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని సందర్శించిన మీనాక్షి నటరాజన్

Published on: Wed Jul 2, 2025 12:17PM

పాశమైలారం సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బుధవారం (జులై 2)  సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను వారు మంత్రి దామోదర్ రాజనర్సింహను అడిగి తెలుసుకున్నారు.  పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో సోమవారం (జూన్ 30) ఉదయం భారీ పేలుడు సంభవించి  36 మంది కార్మికులు మరణించగా, మరో 34 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.  క్షతగాత్రులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇలా ఉండగా  గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందిస్తున్నట్లు వివరించారు. ఇక పోతే ఈ ప్రమాద ఘటన అనంతరం   పదమూడు మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదని సమాచారం.  

ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు, సిబ్బంది సంఖ్యపై గందరగోళం నెలకొంది. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. పేలుడు సంభవించిన సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.  అయితే, కంపెనీ మాత్రం ఆ సమయంలో 156 మంది విధుల్లో ఉన్నారని చెబుతోంది. మరో పదమూడు మంది సిబ్బంది కనిపించడంలేదని తెలిపింది. ఫ్యాక్టరీలో శిథిలాల తొలగింపు పూర్తయ్యాకే ఈ పదమూడు మంది కార్మికులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.