TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాడు ఎన్నికలు...అన్నాడీఎంకే తొలి జాబితా విడుదల

Published on: Thu Mar 26, 2026 5:39PM

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఎన్నికల బరిలోకి దిగుతూ తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 23 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి  ప్రకటించారు. ఈ జాబితాలో అనుభవజ్ఞులైన నేతలకు, ముఖ్యంగా మాజీ మంత్రులకు పార్టీ పెద్దపీట వేయడం గమనార్హం.

ఈ తొలి జాబితాలో పార్టీ అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత గడ్డ అయిన 'ఎడప్పాడి' నియోజకవర్గం నుంచే మళ్ళీ పోటీ చేయనున్నారు. ప్రకటించిన 23 మంది అభ్యర్థులలో ఏకంగా 21 మంది మాజీ మంత్రులు ఉండటం విశేషం. తమకున్న అనుభవం, నియోజకవర్గాలపై పట్టును దృష్టిలో ఉంచుకుని పాత వారికే ఈపీఎస్ మొగ్గు చూపారు. డీ జయకుమార్ రాయపురం నుండి, సీవీ షణ్ముగం మైలం నుండి, ఎస్పీ వేలుమణి తొండముత్తూరు నుండి బరిలోకి దిగుతున్నారు.

ముఖ్య నేతల విషయానికి వస్తే.. కేపీ మునుసామి వేపనహళ్లి నుంచి, దిండిగల్ శ్రీనివాసన్ దిండిగల్ నుంచి, నథమ్ విశ్వనాథన్ నథమ్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ మంత్రులు సెల్లూరు రాజు (మదురై వెస్ట్), సి. విజయభాస్కర్ (విరాలిమలై), ఓఎస్ మణియన్ (వేదారణ్యం) తమ పాత నియోజకవర్గాల నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెజారిటీ నేతలు తమ పాత స్థానాల్లోనే కొనసాగుతుండగా, ముగ్గురు మాజీ మంత్రుల నియోజకవర్గాలను మాత్రం పార్టీ మార్చింది.

కూటమి లెక్కల ప్రకారం అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే సింహభాగం స్థానాల్లో అంటే సుమారు 178 సీట్లలో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎమ్ఎంకేకు 11 స్థానాలను కేటాయించారు. డీఎంకే కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు పళనిస్వామి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

తమిళనాడు వ్యాప్తంగా ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ మార్చి 30 నుంచి ప్రారంభం కానుండటంతో, మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపికను పార్టీ వేగవంతం చేసింది. మరో రెండు రోజుల్లో రెండో జాబితా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రులపై భారం వేసిన అన్నాడీఎంకే, ఈసారి అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉంది.మే 4వ తేదీన వెలువడే ఫలితాలు తమిళనాడులో ఎవరికి పట్టం కడతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని అప్పుడే మొదలుపెట్టేశారు.