వాళ్లిద్దరూ ఒక్కటైతే నేను ఊరుకుంటానా..?

జయ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీతో పాటు తమిళనాడు ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభాలకు తెరదించుతూ పళనిస్వామి, పనీర్ సెల్వం వర్గాలు ఒక్కటయ్యాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాస్తంత చల్లబడుతుందని అందరూ ఊహించారు. ఏఐఏడీఎంకేను, తమిళనాడును శాసించలనుకున్న చిన్నమ్మ శశికళ ఆమె బంధువు దినకరన్‌ల శకం ఇక ముగిసిందని పార్టీ నేతలు భావిస్తోన్న తరుణంలో దినకరన్ జూలు విదిల్చారు.

 

తమను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించాలని చూస్తోన్న పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంలకు చెక్ పెట్టేందుకు ఆయన వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో 19 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు లేఖ ఇచ్చారు. పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు లేదని..ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరారు. ఊహించని ఈ స్ట్రోక్‌తో సీఎం పళనిస్వామి అలర్ట్ అయ్యారు. పార్టీ కీలకనేతలు, మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 

234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అన్నాడీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలుండగా..డీఎంకేకు 95 మంది, పీఎంకేకు 5మంది సభ్యులున్నారు. ఈ 18 మందితో పాటు మరో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు తన వెంట వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు దినకరన్ చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్, దినకరన్‌లు తమ వెంట ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునుందుకు క్యాంపు రాజకీయాలు మొదలెట్టారు. దినకరన్ ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలను చెన్నైలోని ఒక హోటల్‌కు తరలించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి ముగిసిపోయిందనుకున్న కథ మళ్లీ మొదటికి రావడంతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి.