కరుణను "సన్‌"స్ట్రోక్ దెబ్బతీసిందా..?

నిన్న విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి కన్నా పెద్ద షాక్ తగిలింది ఎవరికి అంటే వెంటనే గుర్తొచ్చే పేరు డీఎంకే అధినేత కరుణానిధి. ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు సహా..తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్ర కూడా కరుణకే అనుకూలంగా ఉంది. కానీ వాటన్నింటిని తలకిందులు చేస్తూ తమిళనాడు ఓటర్లు అమ్మకు జై కొట్టడంతో కరుణ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. అయితే ఈ ఓటమికి అధికారపక్షం బలం, విపక్షాల అనైక్యతే కారణమని అందరూ అనుకుంటున్నారు. కాని వీటన్నింటి కంటే ముఖ్యంగా డీఎంకేను దెబ్బ తీసిన వ్యక్తి స్వయానా కరుణ పెద్ద కుమారుడు ఆళగిరి.

 

తన వారసుడిగా రెండో కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించారు కరుణ. దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేని ఆళగిరి తన అక్కసును బాహాటంగానే వెళ్లగక్కారు. అన్నాదమ్ముల మధ్య చీలికలు పార్టీ ప్రతిష్టను వీధిలో పడేస్తుంటే పెద్దకుమారుడిని మధురై పంపేసి అక్కడ నుంచే ఆ ప్రాంతంలోని పార్టీ కార్యకలాపాలు చూడాలని ఆదేశించారు కరుణానిధి. పెద్దవాడినైన తనను కాదని తమ్ముడికి పార్టీలో ప్రాధాన్యమివ్వడాన్ని ఆళగిరి తట్టుకోలేకపోయారు. చివరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కరుణ. ఈ సమయంలో ఎన్నికలు రావడం డీఎంకే గెలిస్తే కరుణానిధి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించినా..ఆయన వారసుడిగా స్టాలిన్ సీఎం పీఠం ఎక్కుతారని ప్రచారం సైతం జరిగింది. ఈ సారి ఎలాగైనా డీఎంకేను ఓడించి తన తండ్రి, తమ్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అళగిరి భావించారు.

 

మధురై ప్రాంతానికి అళగిరి నియంత లాంటి వాడు. అక్కడ ఆయన గీసిందే గీత..చేసిందే చట్టం అలాంటి చోట్ల కనుసైగ చేస్తే చాలు డీఎంకేను నిలువరించడం ఎవరి వల్ల కాదు. కానీ ఇక్కడే అళగిరి చక్రం తిప్పాడు. తాను ఈ సారి డీఎంకేకు ఓటు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంతే జనం ఆయన మాటకు కట్టుబడ్డారు. మద్దతుదారులంతా కలిసి డీఎంకేకు వ్యతిరేకంగా పనిచేశారట. దీంతో మధురై, తిరునెల్వేలి, తేని, దిండిగల్, విరుద్‌నగర్ జిల్లాల్లో అన్నాడీంకే తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మొత్తానికి దాయాదుల పోరు ఆరోసారి కర్చీ ఎక్కే అరుదైన అవకాశాన్ని దూరం చేసింది. దీనిలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జయ విజయంతో అళగిరి మధురైలో తన అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారని సమాచారం.