అర్హత..అనర్హతల సంగతి ఇప్పుడు అవసరమా..?

పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నంత కాలం నల్లేరుపై నడకలా సాగిన అన్నాడీఎంకేకు ఆమె మరణం శరాఘాతంలా తగిలింది. అమ్మ మరణానంతరం పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునేందుకు చిన్నమ్మ వేసిన ఎత్తులు ఫలించకపోవడం..సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. తనకు దక్కకపోయినా పర్లేదు కానీ..పన్నీరుకు మాత్రం సీఎం కుర్చీ దక్కడానికి వీల్లేదని భావించిన చిన్నమ్మ జైలుకు వెళుతూ..వెళుతూ ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రిగా నియమించారు. అప్పటికే పళనిసామిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని..అందువల్ల అలాంటి వ్యక్తి కంటే..అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వమే రాష్ట్రాధినేత కావాలని కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. దీంతో అన్నాడీఎంకే పన్నీరు వర్గంగా..పళనిస్వామి వర్గంగా చిలీపోయింది.

 

ప్రజల మద్దతు లేని పళనిస్వామి కంటే పన్నీరుకే మద్దతు ఉంటుందని, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా ఎప్పటికైనా ఓపీఎస్ చెంతకు చేరుతారని అందరూ భావించారు. అయితే అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి..సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో అసంతృప్తులను చల్లార్చుకుంటూ..అందరినీ కలుపుకుంటూ పోతున్నారు పళనిస్వామి. కానీ మాజీ ముఖ్యమంత్రి, జయ నమ్మిన బంటు పన్నీరు సెల్వం మాత్రం అన్నాడీఎంకే పురచ్చి తలైవి అమ్మ వర్గం పేరుతో రాష్ట్రంలోని సమస్యలపై ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే డీఎంకేకు కోపమొస్తోందని, దీన్ని బట్టి చూస్తే స్టాలిన్‌తో పళని ప్రభుత్వం పొత్తు పెట్టుకుందని స్పష్టమవుతుందన్నారు పన్నీరు.

 

అన్నాడీఎంకే వర్గాలు ఏకమవుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించాలనుకున్నారో లేక మరొకటో కానీ ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ చురుకుగా లేకపోవడంతో రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జల్లికట్టు సమస్య, చెన్నై తాగునీటి కోసం ఏపీ సీఎంను కలిసి 2.5 టీఎంసీల నీటిని పొందడం వంటి కఠినతరమైన సమస్యలను చక్కగా పరిష్కరించానని గుర్తు చేశారు. తాను అమ్మ అడుగు జాడల్లో రాజకీయంగా ఎదిగానని..తాను రెండుసార్లు పెరియకుళం నుంచి, రెండుసార్లు బోడి నియోజకవర్గం నుంచి గెలిచానని ప్రజల మద్దతు తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రారంభించిన ధర్మయుద్ధం కొనసాగుతుందని..ఈ పోరాటంలో విజయం సాధించడానికి అందరు సహకరించాలని పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంగీకరించలేదని...అందువల్ల ఆమె ద్వారా నియమితులైన ఇతరులు పార్టీకి, ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి అనర్హులని..అమ్మ ద్వారా నియమించబడిన తమకు మాత్రమే పార్టీకి నాయకత్వం వహించే అర్హత ఉందని స్పష్టం చేశారు.

 

ఇదిలాఉండగా ఈ అసమ్మతి సెగలను తనకు అనుకూలంగా మార్చకునేందుకు అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌‌ పావులు కదుపుతున్నారు. పార్టీపై పట్టు కోసం 64 మంది అనుయాయులకు పదవులు కట్టబెట్టారు. ఎవ్వరినీ పదవులు నుంచి తొలగించకుండా, ఖాళీగా ఉన్న పదవులను మాత్రమే తన అనచరులతో భర్తీ చేశారు. దీంతో పళని, పన్నీర్ వర్గాలు ఖంగుతిన్నాయి. ఈ అర్హత, అనర్హతలకు అర్థాలు వెతకడం మాని పార్టీని ముందు చేజిక్కించుకోవాలని లేదంటే పార్టీ అంతిమంగా ప్రభుత్వం కూడా మన్నార్‌గుడి మాఫియా చెప్పు చేతల్లోకి వెళ్లిపోతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శశికళ-ఆమె బంధువు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించామని ప్రకటనలు వస్తున్నా..వారిద్దరూ సాంకేతికంగా ఇంకా పార్టీ సభ్యులే..కాబట్టి ఎడప్పాడి, ఓపీఎస్ గ్రూపులు రాష్ట్రంలో, పార్టీలో నెలకొన్న అనిశ్చితిని తొలగించడంపై దృష్టి సారిస్తే మంచిది.