వేర్పాటు వాదులారా ... ఇకనైనా నిజాలు గ్రహించండి ...
Published on: Fri May 11, 2012 8:03AM
గోదావరిపై నిర్మించనున్న ప్రాణహిత పథకానికి సంబంధించి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదరడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. నిజానికి గోదావరి, క్రిష్ణానదులు తెలంగాణా ప్రాంతంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో పాటు అత్యధిక భాగం తెలంగాణాలో ప్రవహిస్తున్నప్పటికీ నీరు మాత్రం భూ ఉపరితలం కంటే 800 అడుగులపైబడి లోతులో వుండటం వల్ల సేద్యానికి ఉపయోగపడని స్థితి వుంది. ముఖ్యంగా గోదావరి నది మూడొంతులు తెలంగాణాలోనే ప్రవహిస్తున్నప్పటికీ భద్రాచలం వచ్చిన తరువాతనే భూ ఉపరితలానికి చేరువగా ప్రవహించడం ప్రారంభమైంది.
ఈ కారణంగానే గోదావరిపై రాజమండ్రి వద్ద మినహా ఎగువ ప్రాంతంలో ఎక్కడా బ్యారేజీ కట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ఒప్పందం కారణంగా ప్రాణహిత సాగునీటి పథకానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లయింది. గోదావరిపై ఏర్పాటు చేస్తున్న ప్రాణహిత ఎత్తిపోతల పథకం. నిజానికి ఎత్తిపోతల పథకాలకు ఉపయోగించే మోటార్లు, వాటికి ఉపయోగించే విద్యుత్ వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ పథకాలను నిర్మించడం కంటే ఆయా పథకాల ద్వారా సాగు అవుతుందని భావిస్తున్న ప్రాంతాల లోని రైతులకు ఎకరాకి 12 వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడం ప్రయోజనకరంగా వుంటుందని పలువురు నీటిపారుదల అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అయినా పంటభూములకు నీటి వసతి పొందడం రైతుహక్కు. భూములకు నీటి వసతి కల్పించడాన్ని రూపాలలో కొలవకూడదు. అందువల్ల తెలంగాణలో ప్రతిపాదించిన ఏ పథకానికి కూడా ప్రజలు అభ్యంతరం చెప్పడం లేదు. అందువల్లనే రాష్ట్రప్రభుత్వం తెలంగాణా ప్రాంతంలో బోరు బావులను ప్రోత్సహించింది.
కోస్తా ప్రాంతరైతులకు కాలువల ద్వారా నీటి సదుపాయం లభిస్తున్న కారణంగా అందుకు ప్రతిగా తెలంగాణా ప్రాంతం ఉచిత విద్యుత్ అందించే పథకానికి ఎన్.టి.రామారావు ప్రవేశపెట్టగా ఇదే సంప్రదాయాన్ని మిగిలిన ముఖ్యమంత్రు లందరూ కొనసాగించడమేకాకుండా మరింతగా ప్రోత్సహించారు. రాష్ట్రం మొత్తం సంవత్సరానికి 4000 నుంచి 5000 కోట్ల రూపాయల ఉచిత విద్యుత్ అందచేస్తుండగా ఈ మొత్తంలో 63 శాతం తెలంగాణా ప్రాంత రైతులకే వినియోగిస్తున్నారు. హైదరాబాద్, ఆంద్రరాష్ట్రాలే కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్రప్రాంతంలో అదనంగా 2.90 లక్షల ఎకరాలు సాగులోకిరాగా తెలంగాణా ప్రాంతంలో మాత్రం 5.70 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో తెలంగాణా జిల్లాల విస్తీర్ణం 41.8 శాంతం. కాని విద్యుత్ వాడకంలోనే కాదు, ఎరువులు, పురుగుమందుల వాడకం వంటి అనేక అంశాలలో తెలంగాణా వాటా 63 శాతం వుంది.


