TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెరిగింది గ్యాస్‌, పెట్రోలేనా.. క‌రెంట్ ఛార్జీల సంగ‌తేంది కేసీఆర్‌?

Published on: Thu Mar 24, 2022 5:53PM

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిర‌స‌న తెలుపుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ మోదీ దిష్టిబొమ్మ‌లు త‌గ‌ల‌బెడుతున్నారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నిన‌దిస్తున్నారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లపై గులాబీ కేడ‌ర్ రోడ్డెక్కి ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేస్తోంది. 

ఇక‌, వ‌రి కొనుగోలుపై కేంద్రానికి వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ ఉద్య‌మిస్తోంది. పంజాబ్ త‌ర‌హాలోనే తెలంగాణ‌లోనూ నేరుగా ధాన్యాన్ని కొనాలంటూ స్వ‌యంగా కేసీఆర్ డైరెక్ష‌న్‌లోనే పార్టీ శ్రేణులు రైతుల ముసుగులో నిర‌స‌న‌లు చేస్తున్నారు. వ‌రి వేస్తే ఉరి అన్న నేత‌లే.. త‌ప్పంతా కేంద్రానిదేనంటూ ఢిల్లీపై బ‌ల‌వంతంగా నెపం మోపుతున్నారు. అటు, కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్ మాత్రం అంతా కేసీఆరే చేస్తున్నారంటూ.. ఎంత ధాన్యం అమ్ముతారో తెలంగాణ ప్ర‌భుత్వం చెప్ప‌ట్లేదంటూ.. ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకోలేదంటూ.. కేసీఆర్‌నే బోనులో నిల‌బెట్టారు. ఇలా ఇష్యూ అంతా వ‌రి చుట్టూనే తిరుగుతోంది. ధాన్యానికి అద‌నంగా.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ రేట్లపై లొల్లి లొల్లి చేస్తోంది గులాబీ ద‌ళం. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత స్వయంగా ధర్నాల్లో పాల్గొని నిరసన తెలిపారు.

అంతా బాగానే ఉంది.. కానీ... క‌రెంట్ ఛార్జీల సంగ‌తేంటి కేసీఆర్‌? అంటూ నిల‌దీస్తున్నారు సామాన్యులు. పెరిగింది పెట్రోల్‌, గ్యాస్ ధ‌ర‌లేనా? అదేదో ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం వ‌ల్ల పెరిగిందంటున్నారు.. మ‌రి, మీ చేతిలోనే ఉన్న విద్యుత్ ఛార్జీల‌ను ఎందుకు పెంచారో చెప్పాలంటూ నిల‌దీస్తున్నారు. ఏకంగా యూనిట్‌కు 50 పైస‌లు పెంచేసి.. ఇండ‌స్ట్రీల‌కైతే 1 రూపాయి బాదేసి.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు క‌రెంట్ షాక్ ఇచ్చిన కేసీఆర్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ముందు ఉద్య‌మించాలంటూ పిలిపిస్తున్నారు. క‌రెంటు బిల్లులు భారీగా బాదేసిన కేసీఆర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు సామాన్యులు. ఇంకా చెప్పాలంటే, భ‌విష్య‌త్తులో అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే పెట్రోల్‌, గ్యాస్ రేట్లు మ‌ళ్లీ త‌గ్గిస్తారు కూడా. అదే ఇప్పుడు పెంచిన‌ క‌రెంట్ ఛార్జీలు మాత్రం ప‌ర్మినెంట్‌. సో.. ఇంధ‌న ధ‌ర‌ల‌కంటే కూడా క‌రెంట్ భారామే త‌డిసిమోప‌డ‌వుతుంది. ఇంత చిన్న లాజిక్ మ‌రిచి.. గులాబీ శ్రేణులు పెట్రోల్‌, గ్యాస్ పెంపుపై రోడ్డెక్క‌డం కామెడీగా ఉందనే విమ‌ర్శ వినిపిస్తోంది. 

క‌రెంట్ ఛార్జీల పెంపు నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికే కేసీఆర్ వ‌రిపై కొనుగోళ్ల‌పై ఆందోళ‌న‌ల‌కు పిలుపిచ్చార‌ని అంటున్నారు. 24, 25 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు తెలుపుతామ‌ని సీఎం కేసీఆర్ కొన్ని రోజులు ముందుగానే ప్ర‌క‌టించారు. ముందే షెడ్యూల్ ఫిక్స్ చేసి.. స‌రిగ్గా 23 సాయంత్రం క‌రెంట్ ఛార్జీలు పెంచడం కుట్ర కాక ఇంకేంటి? అంటున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచేసి.. ఆ టాపిక్ నుంచి ప‌బ్లిక్‌ను డైవ‌ర్ట్ చేస్తూ.. 24న ఉద‌యం వ‌రి కొనుగోళ్ల‌పై కేంద్రాన్ని కార్న‌ర్ చేస్తూ ఆందోళ‌న‌లు.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌ల పెంపుపై ధ‌ర్నాలు చేసి, చేయించి.. డ్రామాను రక్తి కట్టించారని మండిపడుతున్నారు. ఇదంతా కేసీఆర్ జిత్తుల‌మారి ఎత్తుగ‌డ అని.. షాక్ ఇచ్చేలా పెరిగిన క‌రెంట్ బిల్లుల‌పై మాట్లాడ‌కుండా చేసే కుట్ర అని.. చెబుతున్నారు. ప్ర‌తిప‌క్షాలు సైతం క‌రెంట్ ఛార్జీల గురించి రోడ్డెక్క‌క‌పోవ‌డం వారి వైఫ‌ల్య‌మే అంటున్నారు. 24, 25 తేదీల్లో టీఆర్ఎస్ ఆందోళ‌న‌లన్నీ ముగిశాక‌.. ఆ త‌ర్వాత నుంచి క‌రెంట్ షాక్‌పై రంగంలోకి దిగాల‌నేది విప‌క్ష ఆలోచ‌న‌గా తెలుస్తోంది.