TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుతిన్‌కు షాక్‌.. ర‌ష్యా టీవీలో నిర‌స‌న‌.. జెలెన్‌స్కీ అభినంద‌న‌..

Published on: Wed Mar 16, 2022 11:19AM

ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేస్తున్న యుద్ధాన్ని ప్ర‌పంచ‌మంతా వ్య‌తిరేకిస్తోంది. ఆఖ‌రికి ర‌ష్య‌న్లు సైతం వార్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. పుతిన్ తీరును త‌ప్పుబ‌డుతున్నారు. వేలాది మంది ర‌ష్య‌న్ వాసులు.. మాస్కో వీధుల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నారు. నో మోర్ వార్‌.. అంటూ ప్ల కార్డులు, నినాదాల‌తో హోరెత్తిస్తున్నారు. సొంత దేశ ప్ర‌జ‌లే వ్య‌తిరేకిస్తున్నా.. ర‌ష్య అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం త‌గ్గేదేలే అంటూ మ‌రింత‌గా బాంబుల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఉక్రెయిన్ ఉసురు తీస్తున్నారు. 

తాజాగా, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ప్రభుత్వ టీవీ ఛానల్‌ కార్యాలయంలోకి 'మరీనా ఒవ్‌శ్యాన్నికోవా' అనే ఉద్యోగిని నిర‌స‌న తెలిపింది. నో వార్‌.. అంటూ రాసిన పోస్టర్‌ను లైవ్ షో లో ప్ర‌ద‌ర్శించింది. ప్ల‌కార్డ్‌పై.. యుద్ధం వద్దు, తప్పుడు వార్తలను నమ్మొద్దు.. అంటూ ఇంగ్లీష్‌, ర‌ష్య‌న్ లాంగ్వేజ్‌లో రాసుంది. టీవీ ఛాన‌ల్ యాంక‌ర్ న్యూస్ చ‌దువుతుండ‌గా.. మ‌రీనా స‌డెన్‌గా ఇలా పోస్టర్‌తో ప్ర‌త్య‌క్ష‌మైంది. అది దేశ‌వ్యాప్తంగా టెలికాస్ట్ అయింది. వెంట‌నే లైవ్ షోను ఆపేశారు. 

పోస్ట‌ర్‌తో నిరసన తెలిపిన మ‌రీనా అదే టీవీ ఛానెల్‌లో ఉద్యోగిని. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా.. న్యాయస్థానం జరిమానా విధించి వ‌దిలేసింది. ర‌ష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్న ప్రైవేటు టీవీ ఛానళ్లపై అన‌ధికార నిషేధం కొన‌సాగుతుండ‌గా.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఛానల్‌లోనే ఇలా నిరసన తెలియజేయడం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ర‌ష్య‌న్లు ఉక్రెయిన్‌పై దాడికి ఎంత వ్య‌తిరేకంగా ఉన్నారో తెలుస్తోంది. 

ఇక‌, టీవీ ఛానల్‌లో నిరసన తెలిపిన మరీనా ఒవ్‌శ్యాన్నికోవాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభినందించారు. మ‌రోవైపు, మెరినాకు తమ రాయబార కార్యాలయం రక్షణ, ఆశ్రయం కల్పిస్తుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్ ప్ర‌క‌టించారు.