వినియోగదారులకు మరో విద్యుత్ షాక్
Published on: Thu Mar 1, 2012 11:56AM
హై
దరాబాద్: విద్యుత్ బిల్లుల పెంపు షాక్ నుంచి వినియోగదారులు తేరుకోక ముందే ట్రాన్స్ కో మరో షాకిచ్చింది. అదనపు బిల్లుల పేరుతో వేలాది రూపాయలు వడ్డిస్తోంది. ఈ అదనపు ఛార్జీలను నెలలోపు చెల్లించాల్సిందే అంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. విలాస వస్తువులను ఉపయోగిస్తూ విద్యుత్ వాడకాన్ని ఎక్కువగా చేస్తుండటంవల్ల ఈ అదనపు బిల్లు కట్టాల్సిందే అంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సామాన్యులు కూడా కూలర్, ఫ్రిజ్, రైస్ కుక్కర్, ఐరన్ బాక్స్ తదితర ఎలక్ట్రికల్ వస్తువులు కొంటున్నారు. ఇంట్లోకి వెళ్లి చూసి, ఆ వస్తువులు ఇంట్లో కనబడితే చాలు వాడినా వాడకపోయినా అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. వినియోగదారులు దరఖాస్తు సమయంలో ఎన్ని యూనిట్లు విద్యుత్ వాడతామో ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ కెపాసిటికి మించి విద్యుత్ ను వినియోగించడం వల్ల కొరతలు ఏర్పడుతున్నాయని, ఈ విద్యుత్ కోరతలను తగ్గించేందుకే ఇటువంటి ఛార్జీలను వసూలు చేస్తున్నామని ట్రాన్స్ కో అధికారులు అంటున్నారు. విలాస వస్తువుల వల్ల విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.


