కిషన్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్...

ఎర్రబస్సు మాత్రమే ఎక్కిన తెలంగాణ ప్రజలకు, మోడీ ప్రభుత్వం వచ్చాకే రైలంటే ఏంటో తెలిసిందంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేసిన కామెంట్స్ పై విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్‌ నేతలతోపాటు, తెలంగాణ ప్రజానీకం... కిషన్‌ రెడ్డిని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా ఫైరవుతున్నారు. బాహుబలి శివలింగాన్ని మోసుకొచ్చినట్టు, రైల్వేను కిషన్‌ రెడ్డి తెలంగాణకు మోసుకొచ్చారని కొందరు కామెంట్ చేస్తే..... చూడండి, 1905లో మోడీ, కిషన్‌ రెడ్డిలు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించినందుకు, సికింద్రాబాద్ స్టేషన్‌లో టీసీ దించేశారని మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు, 1938లో నిజాం స్టేట్ రైల్వే, ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా టికెట్ రేట్లు తగ్గించడాన్ని ప్రచురించిన ఓ పత్రిక పేపర్‌ కటింగ్‌ను షేర్‌ చేస్తున్నారు. ఇంకా తెలంగాణకు రైలు కావాలని, నెహ్రూను కిషన్‌ రెడ్డి అడిగారంటూ, ఇద్దరి మార్ఫింగ్‌ ఫోటోను పోస్ట్‌ చేశారు. ఇలా కిషన్‌ రెడ్డిపై, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ మామూలుగా లేదు. మొత్తానికి, తెలంగాణలో కిషన్‌ రెడ్డి కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 

అయితే, కిషన్‌ రెడ్డి ఏం మాట్లాడినా, చాలా ఆచితూచి మాట్లాడతారు. అసెంబ్లీలోనూ, బయటా స్పష్టంగా ప్రసంగాలు చేసి శభాష్‌ అనిపించుకున్నారు. కేంద్రమంత్రి అయ్యాక, ఆయన మరింత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కానీ ఎందుకనో, ఏ మూడ్‌లో ఉన్నారో గానీ, పీయూష్‌ గోయల్‌తో కలిసి రైల్వే అభివృద్ది పనులను ప్రారంభించిన సమయంలో మాట తూలారు. దశాబ్దాల క్రితమే  తెలంగాణలో రైలు పరుగులు తీసిందన్న చరిత్ర తెలిసినా, మోడీ వచ్చాకే ఏదో తెలంగాణకు రైలు వచ్చిందన్నట్టుగా మాట్లాడి విమర్శకులకు అవకాశమిచ్చారు. అంతేకాదు, ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రజలంటూ, జనాగ్రహానికి గురయ్యారు. అయితే, ఎప్పుడూ పకడ్బందీగా, పక్కాగా, చక్కగా మాట్లాడే ఆ నాయకుడు, అనవసరంగా మాట తూలారన్న చర్చ జరుగుతోంది. ఏదో మాట్లాడబోయి మరేదో మాట్లాడి అనవసర వివాదంలో ఇరుక్కున్నారంటున్నారు.

కిషన్‌ రెడ్డి కామెంట్లపై బీజేపీలోనూ హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈ కామెంట్లు తెలంగాణలో బీజేపీకి ఇబ్బంది కలిగించేవేనని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుతున్న సమయంలో, కిషన్‌ రెడ్డి కామెంట్లు చేటు చేసేలా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యర్ధి వర్గం ప్రయత్నిస్తోంది.