పాకిస్తాన్ ప్రాణాల్ని తీసుకుంటే... భారత్ బతుకునిచ్చింది
Published on: Sat Jun 4, 2016 3:15PM

ఆఫ్ఘనిస్తాన్! ఈ దేశం గురించి ఇప్పుడు తెలియనివారుండరు. తాలిబాన్ మూకల పుణ్యమా అని ఆఫ్ఘనిస్తాన్ ఓ స్మశానంలా మారిపోయింది. సెప్టెంబరు 11న అమెరికా మీదే కనుక తాలిబాన్ దాడి చేసి ఉండకపోతే, యావత్ ప్రపంచమూ ఆ దేశంలో జరిగే మారణకాండని చూసీ చూడనట్లు ఊరుకునేదే. మత చట్టం పేరుతో అక్కడ జరిగే దారుణాలని పట్టించుకోకుండా సాగిపోయేదే. కానీ సెప్టెంబరు దాడులకు ప్రతీకారంగా అమెరికా మిత్ర రాజ్యాలతో కలిసి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలనని అంతం చేశాయి. ప్రస్తుతానికి అక్కడ తాలిబాన్ పాలన లేకపోవచ్చు. కానీ బతికేందుకు వనరులు కూడా ఏమీ మిగల్లేదు. మరో పక్క మొదటి నుంచీ తాలిబాన్లకు పాలు పోసి పెంచుతున్న పాకిస్తాన్... వారి ముఖ్య నేతలను తమ దేశంలో సకల సౌకర్యాలనూ అందిస్తూ శరణు కల్పించింది. తిరిగి వారిని ఆఫ్ఘనిస్తాన్ మీదకి ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ అందిస్తున్న ప్రోత్సాహంతో తాలిబాన్ తిరిగి పడగ విప్పుతోంది. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు అడపాదడపా తాలిబాన్ దాడులు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ భారత్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రేమతో అయితేనేం, పాకిస్తాన్ మీద ద్వేషంతో అయితేనేం... అంతర్యుద్ధంతో చితికిపోయిన ఆ దేశంలో బతుకు చిగురించేందుకు మొదటి నుంచీ సాయం చేస్తూ వస్తోంది. గత ఏడాది ప్రపంచంలోనే అద్భుతమైన పార్లమెంటుని ఆప్ఘనిస్తాన్‌కు కానుకగా ఇచ్చిన మన దేశం ఇప్పుడు 1700 కోట్లతో ఒక ఆనకట్టను నిర్మించి ఇచ్చింది. అమెరికా వంటి సంపన్న దేశాలు సైతం చేతులు దులుపుకొని వెళ్లిపోయిన చోటుని సస్యశ్యామలంగా మార్చేందుకు ఈ ఆనకట్ట ఉపయోగపడనుంది. హేరత్ ప్రాంతంలోని చిష్ట్-ఏ-షరీఫ్ అనే నది మీద నిర్మించిన ఈ ఆనకట్టతో 75 వేల హెక్టార్లకు సాగునీరు అందడంతో పాటుగా 42 మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి కానుంది. అయితే ఈ ఆనకట్ట నిర్మాణం ఏమంత తేలికగా పూర్తికాలేదు. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ నిర్మాణాన్ని అడుగడుగునా తాలిబాన్ మూకలు అడ్డుకుంటేనే ఉన్నాయి. ఇక్కడ రక్షణ విధులను నిర్వహిస్తూ 50 మంది సైనికులు చనిపోయారంటే పరిస్థితులు ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు అటు తాలిబాన్, ఇటు పాకిస్తాన్ మొహాలు చిన్నబోయేలా, మనసులు చురుక్కుమనేలా... ఆఫ్ఘన్-భారత్ దేశాలు కలిసి ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఆనకట్టను సగర్వంగా ప్రారంభించారు.


