TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. భక్తుల ఆందోళన, ఆగ్రహం

Published on: Mon Jun 2, 2025 10:04AM

ఎన్ని సార్లు అభ్యంతరం తెలిపినా విమానయాన శాఖ ఖాతరు చేయడం లేదు. ఆగమశాస్త్ర విరుద్ధంగా తిరుమల గిరులపై నుంచి, అందులోనూ శ్రీవారి ఆలయంపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానాలు వెడుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 1) ఉదయం ఒక విమానం శ్రీవారి ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణించింది.  ఇందుకు సంబంధించి తిరుమలలో భక్తులు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. తిరుమల భద్రతపై భక్తులలో ఆందోళన వ్యక్తమౌతోంది. పదేపదే విజ్ణప్తి చేసినా ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా విమానాలు తిరుమలేశుని ఆలయం మీదుగా వెళ్లడాన్ని విమానయాన సంస్థ నిషేధించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నిమార్లు విజ్ణప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.  

గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.  తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి ఆగమశాస్త్ర విరుద్ధంగా శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్లడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వెంటనే ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయం మీదుగా ప్రయాణించిన విమానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు గానీ, హెలికాప్టర్లు గానీ ప్రయాణించడం పూర్తిగా నిషిద్ధం. ఇలాంటి ప్రయాణాలను అపచారంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే తిరుమలను 'నో ఫ్లై జోన్'గా ప్రకటించాలని టీటీడీ చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే  కేంద్రం మాత్రం ఇది  ఆచరణ సాధ్యం కాదని తెలుపుతూ వస్తోంది. దీంతో ఈ విషయంలో టీటీడీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.  ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని  తిరుమలను ' నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.