అద్వానీ సంచలన నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం

 

బీజేపీ అంటే ఇప్పుడేదో తెరమీద మోదీ, అమిత్ షా కనిపిస్తున్నారు కానీ.. మోదీ, అమిత్ షా వంటి వారు ఎదగడానికి, బీజేపీ అధికారంలోకి రావడానికి కొందరు నేతల కృషి ఉంది. ఎన్ని అవమానాలు ఎదురైనా, అలసిపోయినా బీజేపీని తమ భుజాల మీద మోస్తూ.. బీజేపీని సున్నా నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు కొందరు నేతలు. వారిలో ముందు వరుసలో ఉంటారు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ. ఎంత ఎదిగినా వొదిగి ఉండటం ఈతరం రాజకీయ నాయకులు ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. తనకంటే జూనియర్లు, తనవల్ల పార్టీలో ఎదిగినవాళ్లు ఆయన్ని అవమానించినా.. పార్టీకి నష్టం జరిగే వ్యాఖ్యలు చేయకుండా బాధనంతా గుండెల్లో దాచుకున్న గొప్ప వ్యక్తి అద్వానీ. అయితే ఇప్పుడు ఆయన గురించి ఓ సంచలన వార్త వినిపిస్తోంది. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అమిత్ షాకు చెప్పారట. మరోసారి గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని అద్వానీని అమిత్ షా కోరగా.. పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్టు సమాచారం. కనీసం అద్వానీ సంతానమైన జయంత్, ప్రతిభలలో ఒకరిని గాంధీనగర్ నుంచి బరిలోకి దింపాలని.. వారిని గెలిపించుకునే బాధ్యతను తాము తీసుకుంటామని అమిత్ షా కోరినప్పటికీ, దానికి కూడా అద్వానీ నిరాకరించారట.