ఆదిలాబాద్ నుంచి అందలం ఎక్కింది ఇద్దరే
Published on: Fri Mar 9, 2012 10:29AM
ఆది
లాబాద్: ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే ఈ ప్రాంతం నుంచి ఇప్పటి దాకా పలువురు అభ్యర్ధులు గెలిచినప్పటికీ కేవలం ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సి. రామచంద్రారెడ్డి, టిడిపికి చెందిన పడాల భూమన్నకు మాత్రమే అందలం ఎక్కే అవకాశం దక్కింది. మిగిలినవారంతా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటివరకు 13సార్లు ఎన్నికలు జరిగాయి. పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్ మూడుసార్లు, టిడిపి మూడు సార్లు, సిపిఐ ఒకసారి గెల్చుకోగా, నలుగురు ఇండిపెండెంట్లు ఇక్కడినుంచి అసెంబ్లీకి వెళ్ళారు. సి. రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ లో నాలుగుసార్లు ఎన్నిక కాగా రెండుసార్లు ఇండిపెండెంట్ గా, రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. ఆయన గతంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.1999 లో ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన టిడిపి అభ్యర్ధి పడాల భూమన్న రాష్ట్ర మంత్రివర్గంలో జౌళిశాఖ మంత్రిగా వ్యవహరించారు.


