TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాటి మిత్రులే నేటి ప్రత్యర్ధులు

Published on: Sat Mar 3, 2012 1:29PM

ఆదిలాబాద్: ఆదిలాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పాయల్ శంకర్ తెలంగాణా రాష్ట్రసమితి తరపున పోటీ చేస్తున్న జోగు రామన్న ఒక నాడు మంచి మిత్రులుగా ఉండేవారు. గత 15 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికలోనూ వీరు కలిసే పనిచేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వీరు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు పోటికి తలపడుతున్నారు. గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి మెలిసి పనిచేశారు. పాయల్ శంకర్ రాజకీయ ప్రస్థానం జైనద్ మండలం దీపాయిగూడాలో ఎంపిటిసి సభ్యుడుగా ప్రారంభమైంది. అప్పుడే పాయల్ శంకర్ కు జోగు రామన్నకు మధ్య పరిచయం ఏర్పడింది. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు లింగారెడ్డి ప్రస్తుత జైనద్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఆ మండల యువత అధ్యక్షుడుగా ఉన్న బాలాపూర్ విఠల్ కలిసి మెలిసి ఉండేవారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయంగా వీరు ప్రభల శక్తిగా వ్యవహరించారు. పరస్పరం సహకరించుకుంటూ ఎన్నికల్లో ముందుకు వెళ్ళేవారు. 2009 ఎన్నికల్లో జోగు రామన్న ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన జైనద్ జెడ్ పిటిసి స్థానంకు పోటీచేసే అవకాశాన్ని శంకర్ కు ఇప్పించాడు. ఈ ఎన్నికల్లో శంకర్ సునాయాసంగా విజయం సాధించారు. 2009 నుంచి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రామన్న తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ఆరునెలల క్రిందట నాగం జనార్ధనరెడ్డితో కలిసి తెలంగాణా నగారా సమితి ఏర్పాటుచేశారు. ఇది అతని మిత్రుడైన పాయల్ శంకర్ కు రుచించలేదు. అతను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చాడు. ఎన్ని ఇబ్బందులెదురైనా పార్టీని వీడలేదు. దీనికి గుర్తింపుగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పాయల్ శంకర్ కు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మిత్రులిద్దరూ ఒకరిపై మరొకరు పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.