ఆంజనేయుడికి ఆధార్ కార్డు..
Published on: Fri Sep 12, 2014 12:16PM

సామాన్యులకి ఆధార్ కార్డు కావాలంటే నానా తంటాలూ పడాలి. అదే దేవుడికైతే కనీసం అప్లయ్ కూడా చేసుకోకుండా ఆధార్ కార్డు వచ్చేస్తుంది. ఆధార్ కార్డు అధికార వర్గాలు సాక్షాత్తూ హనుమంతుడికి కూడా ఆధార్ కార్డు ఇచ్చేశాయి. ఆయన ఆధార్ సంఖ్య 2094 7051 9541. కార్డుపై హనుమంతుడి ఫొటోతో సహా ఇతర వివరాలు కూడా పొందుపర్చారు. ఆయన తండ్రి పేరు పవన్ (వాయుదేవుడు). అక్కడితో ఆగారా... ఆధార్ కార్డులో హనుమంతుడి మొబైల్ ఫోన్ నంబర్‌తో పాటు వేలిముద్ర కూడా ఉంది. ఆయనకి 53 ఏళ్ళని, ఆయన 1-1-1959న పుట్టినట్టు కార్డు మీద వుంది. సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని దంత రాంగఢ్ ప్రాంతానికి బెంగుళూరు నుంచి ఈ ఆధార్ కార్డు వచ్చింది. అయితే అడ్రసు సరిగ్గా లేకపోవడంతో ఎవరికి అందజేయాలో తెలియక పోస్ట్ మాన్ తికమకపడ్డాడు. తీరా అది హనుమంతుడి పేరుతో సృష్టించిన ఆధార్ అని తెలుసుకుని బిత్తరపోయాడు. ఆధార్ కార్డు మీద ఉన్న సెల్‌కు ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో చేసేదేమీ లేక పోస్టు మాన్ దీనిని బెంగళూరుకు తిప్పిపంపాడు.


