అదానీని ఆటాడుకుంటున్న నెటిజన్లు! గంగూలి అనారోగ్యంతో చిక్కులు
Published on: Wed Jan 6, 2021 4:07PM
అదానీనీ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.. అవును మీరు చదివింది నిజమే... భారత దేశంలో దిగ్గజ వ్యాపార సంస్థగా ఉన్న అదానీ గ్రూప్ ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. సెటైర్లు, జోకులు పేలుస్తూ ఆ గ్రూప్ కు చిక్కులు తెప్పిస్తున్నారు. దీనంతటికి కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దాదాకు గుండెపోటు రావడంతో అదానీ గ్రూపుకు డేంజర్ సిగ్నల్ పడింది. గంగూలీకి గుండెపోటు వస్తే.. అదానీ గ్రూప్ సంస్థకు సమస్యేంటని అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు తిరకాసు.. ఆదానీ గ్రూప్ విల్మార్ కంపెనీకి చెందిన ‘ఫార్చ్యూన్ రైస్‌బ్రాన్ ఆయిల్’కు దాదా బ్యాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటమే ఆ సమస్యకు కారణం. ఆ కంపెనీ యాడ్‌లో ఆరోగ్యమైన గుండె కోసం, రోగ నిరోధకశక్తిని పెంచేందుకు ఫార్చ్యూన్ రైస్‌బ్రాన్ ఆయిల్ వాడాలని ప్రజలకు సూచిస్తారు సౌరబ్ గంగూలీ. జనాలకు అరోగ్య చిట్కా చెప్పిన వ్యక్తే .. ఇప్పుడు గుండెపోటుకు గురి కావడంతో ఆ యాడ్ తీవ్ర విమర్శల పాలైంది.
గంగూలికి గుండెపోటు రావడంతో అదానీ విల్మార్ ఫార్చ్యూన్ రైస్ బ్రాండ్ ఆయిల్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. అదానీ కంపెనీ ఆయిల్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్రాండ్ అంబాసిడర్‌కే గుండె పోటని కామెంట్లు పెడుతున్నారు. ఫార్చ్యూన్ ఆయిల్ వాడవద్దని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అదాని కంపెనీ ఆయిల్ వాడటం వల్ల గుండెపోటు వస్తుందని ప్రచారం చేస్తున్నారు. సినీ, క్రీడాకారులతో ఎక్కువగా ప్రకటనలు చేసే కంపెనీల యాడ్స్ ఎంత ఫాల్స్ అన్నది... దాదా ఘటనతో మరోసారి రుజువైందని కొందరు కామెంట్లు పెట్టారు. అలా బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ గుండెపోటు ఆదానీ విల్మార్ కంపెనీ కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది.
గుంగూలికి గుండెపోటు, తమ కంపెనీ ప్రోడక్ట్ పై వస్తున్న విమర్శలతో అప్రమత్తమైన అదానీ గ్రూప్.. చాలా తెలివిగా ఆ ప్రకటనను నిలిపివేసింది. అంతేకాదు గుంగూలి అన్ని ప్రకటనలను ఆపేసింది. ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక.. ఆయనతో మాట్లాడి కొనసాగిస్తామని తెలిపింది. అయితే దీనిపైనా విమర్శలు వచ్చాయి. దీంతో అదానీ విల్మార్ గ్రూప్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. సౌరవ్ గంగూలీని తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తామని ప్రకటించింది. "మేము సౌరవ్‌తో కలిసి పనిచేయడం కొనసాగిస్తాము మరియు అతను మా బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారు. మా వాణిజ్య ప్రకటనలో తాత్కాలిక విరామం మాత్రమే తీసుకున్నామని అదానీ విల్మార్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంగ్షు మల్లిక్ చెప్పారు. అంతేకాదు ఫార్చ్యూన్ బ్రాండ్‌ను డిఫెండింగ్ చేస్తూ.. తాము ఉత్పత్తి చేస్తున్నది మెడిసిన్ కాదు.. వంటనూనే మాత్రమేనని తెలిపారు. ఆరోగ్య సమస్యలకు ఇది కారణం కాదన్నారు. ఆహార మరియు వంశపారంపర్య సమస్యలు గుండె జబ్బులను ప్రభావితం చేస్తాయని మల్లిక్ చెప్పుకొచ్చారు.
ఇంట్లో ట్రేడ్‌మిల్ చేస్తుండగా హార్ట్ ఎటాక్‌కు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ శనివారం స్థానిక వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దాదా హార్ట్‌లో మూడు బ్లాక్స్ గుర్తించిన డాక్టర్లు వెంటనే సర్జరీ చేసి ఒక స్టెంట్ వేశారు. దాంతో దాదాకు ప్రాణాపాయం తప్పింది. దాదా ఇంకా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు.


