ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ అదానీ! పోర్టులు, రైల్వేలది కూడా అదే దారి? 

పోటీ తత్వం పెరిగితే  నిర్వహణ  బాగుంటుంది.. సమర్థత మెరుగుపడుతుంది.. వినియోగదారులకు ప్రయోజనం కల్గుతుంది. ఇదే ఇక్కడైనా ఉండే మార్కెట్  మౌలిక సూత్రం. అందుకే ప్రైవేట్ రంగంలో వివిధ సంస్థలు నిత్యం పోటీ పడుతూ.. తమ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటాయి. అదే సమయంలో తమ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ వారి ఆదరణ చూరగొనేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు మనదేశంలోనూ ప్రైవేటైజేషన్ పెరిగిపోతోంది. నరేంద్ర మోడీ సర్కారే స్వయంగా ప్రైవేట్ రంగానికి ఊతమిస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలకు వాటికి అప్పగిస్తోంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ పని చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటోంది బీజేపీ సర్కార్. కాని ఆచరణలో మాత్రం మోడీ సర్కార్  కనీస మౌలిక సూత్రాన్ని మర్చిపోయింది. ఒకే సంస్థకు ఎయిర్ పోర్టులు, పోర్టులు కట్టెబెడుతోంది. ఇప్పటికే  అతి పెద్ద రెండు అంతర్జాతీయ  విమానాశ్రాయల నిర్వహణ చూస్తున్న అదానీ గ్రూప్ కే మరో ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్పగించింది. నీతి అయోగ్‌, ఆర్థిక శాఖ అభ్యంతరాలు చెప్పినా...అదానీకే విమానాశ్రయాలను కేంద్రం ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 

కార్పొరేట్ల అనుకూల ప్రభుత్వంగా  విమర్శలు ఎదుర్కొంటున్న  మోడీ సర్కార్‌ బడా వ్యాపారుల జేబులు నింపేందుకే పాటుపడుతోందని విమానాశ్రయాల లీజు ఘటనతో మరోసారి రుజువైందనే ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ, నీతి అయోగ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికి 2019 ఫిబ్రవరిలో ప్రముఖ వ్యాపార సంస్థ ఆదానీ గ్రూప్‌ ఆరు విమానాశ్రయల కోసం బిడ్‌లు సొంతం చేసుకోవడం ఇందుకు నిదర్శనం. అహ్మదాబాద్‌, లక్నో, జైపూర్‌, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల నిర్వహణను 50 ఏళ్ల పాటు లీజుకు ఒప్పందం చేసుకుంది అదానీ గ్రుపు. ఈ సంవత్సరం జనవరి 12న ఈ ఆరు విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతను అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అదానీ గ్రూప్  స్వాధీనం చేసుకుంది. 2020 ఆగస్టు 31న ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో  74 శాతం వాటాను  సొంతం చేసుకుంది అదానీ. ముంబై ఎయిర్‌పోర్టులో మిగిలిన 26 శాతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది. న‌వీ ముంబైలో కొత్త‌గా నిర్మించ‌త‌ల‌పెట్టిన విమానాశ్ర‌యం కూడా అదానీ గ్రూప్ చేతిలోకే వెళ్లింది.  దీంతో ప్రస్తుతం దేశంలోని ఎనిమిది అంతర్జాతీయ విమానాశ్రయాలు అదానీ గ్రూపులోకి వెళ్లాయి. 

తమ స్నేహితుడు ఆదానీకి విమానాశ్రయాల వ్యాపారంలో అడుగుపెట్టుందుకు అనుగుణంగానే   మోడీ సర్కార్‌ పాత  నిబంధనలకు పాతర వేసిందని తెలుస్తోంది.
విమానాశ్రయాల ప్రైవేటీకరణ కోసం  పౌర విమానయాన శాఖ ప్రతిపాదనపై 2018, డిసెంబర్‌ 11న పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పిపిఎసి) చర్చించింది. అనంతరం ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఓ ప్రతిపాదన చేసింది. ఈ ఆరు విమానాశ్రయాలు పెద్ద మొత్తంలో మూలధనం వ్యయంతో కూడుకున్నవని, అందువల్ల ఒకే బిడ్డర్‌కు రెండు, అంతకంటే ఎక్కువ విమానాశ్రయాల నిర్వహణను ఇవ్వలేమన్న నిబంధనలను చేర్చాలని సూచించింది. వేర్వేరు సంస్థలకు ఇవ్వడం కూడా పోటీ ప్రాతిపదికకు దోహదపడుతుందని పేర్కొంది. ఉదాహరణగా ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాలను చూపిస్తూ..  జిఎంఆర్‌ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. ఈ రెండు విమానాశ్రయాల నిర్వహణకు ఇవ్వలేదని తెలిపింది. డిఇఎ మాదిరిగానే నీతి అయోగ్‌ తన అభ్యంతరాలను లేవనెత్తింది. తగినంత సాంకేతిక సామర్థ్యం లేని బిడ్డర్‌కు అప్పగిస్తే ప్రాజెక్టు దెబ్బతినే అవకాశాలున్నాయని, సేవల నాణ్యతలో రాజీ పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. 

ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నీతి అయోగ్‌  లేవనెత్తిన  అభ్యంతరాలను తిరస్కరించింది పిపిఎసి. బిడ్డింగ్‌ కోసం ఇదే రంగంలో ముందస్తు అనుభవం అవసరం లేదంటూ నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూపుకు బిడ్లు దక్కాలనే ఉద్దేశంతోనే.. ఆ బడా వ్యాపారికి అనుగుణంగా పిపిఎసి నిబంధనలను తొక్కి పెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు బిడ్లను గెలుచుకున్న సంవత్సరం తర్వాత అదానీ గ్రూప్‌ అహ్మదాబాద్‌, లక్నో, మంగళూరు విమానాశ్రయాలపై రాయితీ ఒప్పందాలపై సంతకం చేసింది. కరోనా సంక్షోభాన్ని సాకుగా చూపుతూ ఆ విమానాశ్రయాలు తీసుకునేందుకు ఈ ఫిబ్రవరి వరకు అవకాశం ఇవ్వాల్సిందిగా అనుమతి తీసుకుంది.   కేంద్రం కూడా అదానీ గ్రూప్ చెప్పినట్లే అన్ని అనుమతులు ఇచ్చేసింది. విమానాశ్రయాలే కాదు పోర్టులను కూడా ప్రైవేటైజైషన్ లో భాగంగా అదానీ గ్రూపుకే కట్టబెడుతోంది మోడీ సర్కార్. ప్రస్తుతం దేశంలోని 10 పోర్టులు అదానీ గ్రూప్ చేతిలోనే ఉన్నాయి. ఇందులో ఏపీలోని విశాఖ పోర్టు కూడా ఉంది. అంటే దేశంలో అత్యంత కీలకమైన 8 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 పోర్టులు అదానీ చేతిలో ఉన్నాయంటే.. మోడీ సర్కార్ ఒక్క బడా వ్యాపారి కోసం ఎంతగా పరితపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. 

 ఎయిర్‌క్రాఫ్ట్ స‌వ‌ర‌ణ బిల్లును గత సెప్టెంబర్ లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది మోడీ సర్కార్. అప్పుడే విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. విమానాశ్ర‌యాల ప్రైవేటీక‌ర‌ణ‌ను తప్పుపట్టాయి.
కేవ‌లం అదానీ గ్రూపుకు ఆరు బిడ్లు ఎలా ద‌క్కాయ‌ని కాంగ్రెస్ ఎంపీలు ప్ర‌శ్నించారు.  అదానీకి అనుకూలించే విధంగా ష‌ర‌తుల‌ను మార్చేశారని ఆరోపించారు. డీఈఏ, నీతిఆయోగ్ ఇచ్చిన‌ ప్ర‌తిపాద‌న‌ల‌నే కేంద్ర ప్ర‌భుత్వం విస్మ‌రించిందని మండిపడ్డారు.  భార‌తీయ విమానాశ్ర‌యాల‌ను గుత్తాధీప‌త్యంలోకి తీసుకువెళ్తున్న‌ట్లు విమ‌ర్శించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రానున్న రోజుల్లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ అదానీగా మారుతుంద‌ని కాంగ్రెస్ ఎంపీలు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఆరోపించినట్లుగానే ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా .. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ అదానీగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 2017లో 0.004 శాతం ఎయిర్ ట్రాఫిక్ గా ఉన్న అదానీ గ్రూప్.. కేవలం రెండేళ్లలోనే 23.6 శాతానికి చేరుకుంది. మోడీ సర్కార్ అండతో త్వరలోనే భారత విమానయాన సంస్థ మొత్తం అదానీ చేతుల్లోకి వెళుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 
          
 విమానాశ్రయాలు, పోర్టులే కాదు రైల్వేలోనూ కొంత భాగం అదానీ గ్రూపుకు దక్కింది. ఇప్పటికే అదానీ పేరుతో ఉన్న రైలు బోగీలు పట్టాలపై తిరుగుతున్నాయి. త్వరలో మరిన్ని రైళ్లు అదానీ గ్రూప్ కు దక్కబోతున్నాయి. ప్రైవేటైజేషన్ పేరుతో అదానీకి ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ కట్టబెట్టడం దేశానికి  ప్రమాదకరమంటున్నారు నిపుణులు. దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న రైతులు.. పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలోనే దేశ వ్యవసాయ రంగంమంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందని... మోడీ స్నేహితులైన అదానీకే కట్టబెట్టవచ్చనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే దేశ ప్రజలు తినే ఆహారం, పంటల ధరలు, నియంత్రణ మొత్తం  అదానీ చెప్పినట్లే జరగాల్సిన పరిస్థితి వస్తుందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర సర్కార్ తెచ్చిన కొత్త సాగు చట్టాలు కూడా అదానీ లాంటి బడా వ్యాపారులకే ప్రయోజనం కలిగేలా ఉన్నాయంటున్నారు అన్నదాతలు.