కన్నతల్లిపై నటి సంగీత సంచలన వ్యాఖ్యలు

 

సౌత్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి సంగీత కుటుంబంలో కలహాలు చోటుచేసుకున్నాయి. సంగీతపై ఆమె తల్లి భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురు తనను ఇంట్లోంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నట్లు సంగీత తల్లి ఫిర్యాదు చేశారు. తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని దోచేయాలనే ఉద్దేశంతో సంగీత ఇలా చేస్తోందని ఆరోపించారు. దీంతో సంగీతపై నెగిటీవ్‌ పబ్లిసిటీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సంగీత సోషల్‌మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించారు.

‘ప్రియమైన అమ్మ.. నాకు జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు. చిన్న వయసులోనే స్కూల్ మాన్పించి డబ్బు కోసం పనికి పంపినందుకు ధన్యవాదాలు. నాతో బ్లాంక్ చెక్కులపై సంతకాలు చేయించినందుకు ధన్యవాదాలు. మద్యం, డ్రగ్స్‌కు బానిసై, జీవితంలో ఏ రోజూ పనికి వెళ్లని నీ కుమారుల సౌకర్యాల కోసం నన్ను దోపిడీ చేసినందుకు ధన్యవాదాలు. నీ నిర్ణయాలకు అడ్డు రాకుండా మన సొంత ఇంటిలోనే నన్ను ఓ మూలన ఉంచినందుకు ధన్యవాదాలు. నన్ను, నా భర్తను నిరంతరం వేధిస్తూ మా కుటుంబ ప్రశాంతతను దూరం చేసినందుకు ధన్యవాదాలు. ఓ తల్లి ఇలా ఉండకూడదని నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చివరిగా.. నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకు ధన్యవాదాలు. నీకు తెలిసో, తెలియకో నన్ను నోరులేని అమ్మాయి నుంచి పోరాడే మహిళగా మారేలా చేశావు. ఇప్పుడు శక్తిమంతమైన మహిళగా అయ్యాను. ఈ విషయంలో నువ్వు నాకు నచ్చావు. ఏదో ఒక రోజు నీ ఈగో పక్కనపెట్టి, నన్ను చూసి ఖచ్చితంగా గర్వపడుతావు’ అని సంగీత భావోద్వేగంతో ట్వీట్ చేసి తల్లి చేసిన పనులు బయటపెట్టారు.