కేసీఆర్ కి ఎందుకు భయపడాలి.. డేటా చోరీ చేసింది తెలంగాణ సర్కారే

 

తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఐటీ గ్రిడ్‌ కేసు తెరపైకి తెచ్చారని సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డేటా చోరీ అంశంపై శివాజీ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘డేటా దొంగతనం అంతర్జాతీయ సమస్యలా భారతదేశంలో మొదటిసారి జరుగుతున్నట్లు రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. తెలంగాణ ఓట్ల గల్లంతు అనేది వారికి కుంభకోణం కాకపోవచ్చు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారని తెలుసుకోవాలి. ఎన్నికల అధికారికి కేసీఆర్‌ ఫోన్‌ చేసి అడగాల్సిన పని ఏంటి? ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం. గ్రేటర్‌ హైదరాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో సెటిలర్స్‌ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఓట్లు తొలగించే ముందు సమగ్ర సర్వే పూర్తి చేశారు. ఐటీశాఖ, ఈసీ కలిసి హైదరాబాద్‌లో ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశాయి. అందుకు ఎస్‌ఆర్‌డీహెచ్‌ యాప్‌ను తయారు చేశారు. ఓట్లు తొలగించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను వాడుకున్నరనేది నిజమా? కాదా?’ అని శివాజీ ప్రశ్నించారు.

ఏపీ సీఎం డేటా చోరీ చేశారని ఎన్నికల ముందు ప్రచారం చేసేందుకే సిట్ వేసిందని తెలంగాణ ప్రభుత్వంపై శివాజీ మండిపడ్డారు. చంద్రబాబుపై లేనిపోని నిందలు వేసేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి తాను బయటకొచ్చి మాట్లాడతానని పేర్కొన్నారు.

డేటా చోరీ చేసింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఓట్ల తొలగింపుపై అప్పట్లోనే మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు అని గుర్తు చేశారు. డేటా చోరీ చేసింది తెలంగాణ ప్రభుత్వం అయితే దొంగే దొంగ అన్న చందంగా ఉందన్నారు. దొంగతనం చేసిన కేసీఆర్ ఏపీపై విరుచుకుపడతారా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను చంపేశారని విమర్శించారు. కేసీఆర్ ఏపీని నాశనం చేసేలా, అవమానించేలా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాము కేసీఆర్ ను ఎన్నుకున్నామని అలాంటి వ్యక్తి ఆంధ్రోళ్లు దొంగలు అంటూ వ్యాఖ్యానిస్తారా అని మండిపడ్డారు.

తాను ప్రెస్ మీట్ పెట్టేందుకు బయలు దేరుతుంటే తన భార్య తనను పట్టుకుని ఏడ్చిందని, చేతులు పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టొద్దంటూ వేడుకుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ని చూసి ఎందుకు భయపడాలి అని ప్రశ్నించారు. తాము ఓటేసి ఎన్నుకున్న వ్యక్తి కేసీఆర్ అని, ఒక ప్రజాప్రతినిధిగా తమను ఇలా బెదిరిస్తారా తమాషాలు చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. అదేవిధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా శివాజీ ఫైరయ్యారు. హైదరాబాద్ రావడానికి ఆంధ్రపోలీసులకు హక్కు ఎక్కడిది అంటూ నిలదీయడాన్ని మండిపడ్డారు. హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని అని.. ఏపీ పొలీసులు రావొచ్చని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుని అడ్డుకోవడానికి కేటీఆర్ ఎవరంటూ శివాజీ మండిపడ్డారు.