రాహుల్‌ గాంధీకి ప్రకాష్ రాజ్‌ మద్దతు

 

జైపూర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ‘పార్లమెంట్‌లో రఫేల్‌ ఒప్పందం గురించి చర్చ జరిగే సమయంలో మోదీ పారిపోయి తనను కాపాడమని ఓ మహిళ ను కోరారు. ఆయన తనను తాను కాపాడుకోలేకపోయారు’అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్‌ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ వివాదంపై స్పందించిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్‌గాంధీ మహిళలకు వ్యతిరేకం కాదు. పార్టీలో ఓ కీలక పదవిలో ట్రాన్స్‌జెండర్‌ను నియమించారు. ఎందుకు మీరు ఆయన వ్యాఖ్యలను ఒకే కోణంలో చూస్తున్నారు? ప్రధాని పార్లమెంట్‌కు రాని విషయం.. రాహుల్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం నిజం కాదా? మనం ఆ కోణంలోనూ చూడాలి’ అని హితవు పలికారు.