వైసీపీలో చేరిన మోహన్ బాబు

 

సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆయన కలిశారు. జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. మోహన్ బాబుతో పాటు ఆయన తనయుడు, సినీ నటుడు మంచు విష్ణు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.

వైసీపీలో చేరిన సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. తాను పదవి ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. తెలుగు ప్రజల మేలు కోసమే వైసీపీలో చేరానన్నారు. 'ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబుతో ఎన్నోసార్లు మాట్లాడాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఇంకా రూ. 19 కోట్లు రావాలి. మూడు విడతల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని చేయలేదు. కాపు విద్యార్థులకు రావాల్సిన రూ. 2 కోట్లు ఇవ్వలేదు. వైసీపీలో చేరాలని జగన్‌ మూడేళ్ల కిందటే అడిగారు. ఏపీకి జగన్‌ సీఎం అయితే బాగుంటుంది. జగన్ ఆదేశిస్తే కార్యకర్తగా ప్రచారం చేస్తా. రేపు లేదా ఎల్లుండి ప్రచారానికి నేను వెళ్లొచ్చు' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో ఇటీవలే అధికార టీడీపీ ప్రభుత్వంపై మోహన్ బాబు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వెనుక వైసీపీ ఉందని, వైసీపీకి లాభం చేకూరాలని ఆయన టీడీపీ ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు వైసీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.