కాణిపాకం దేవాలయంలో తుపాకీతో చరణ్‌రాజ్ ఎంట్రీ...
Published on: Fri Aug 29, 2014 11:39AM

ప్రముఖ నటుడు చరణ్‌రాజ్ వినాయకచవితి రోజున చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దేవాలయంలో హడావిడి చేసి వివాదం సృష్టించారు. కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలోకి చరణ్‌రాజ్ రివాల్వర్‌తో ప్రవేశించారు. భద్రతా సిబ్బంది సరిగ్గా తనిఖీలు చేయకపోవడంతో పాటు.. భద్రత కోసం ఆలయంలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లు పని చేయకపోవడతో చరణ్ రాజ్ రివాల్వర్‌తోనే ఆలయం లోపలికి వెళ్లి వినాయకుడిని దర్శనం చేసుకున్నారు. ఆలయమంతా తిరిగారు. భక్తులు చరణ్ రాజ్ వద్ద తుపాకీ ఉన్న విషయాన్ని గుర్తించి ఆలయ అధికారులకు సమాచారం చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన వద్ద తనిఖీ చేయగా, తుపాకీ బయటపడింది. దాంతో ఆలయంలోకి రివాల్వర్ తీసుకురావడం పట్ల చరణ్‌రాజ్ క్షమాపణలు చెప్పారు. వినాయక మాల తీసివేసే హడావుడిలో పొరపాటున గన్‌ను పక్కన పెట్టడం మరచిపోయానని చెప్పారు. ఈ విషయంలో పోలీసులు, భక్తులు, ఆలయ సిబ్బంది తనను క్షమించాలని కోరారు. చివరికి ఆలయ అధికారులు చరణ్ రాజ్‌కు తుపాకీని తిరిగి అప్పగించారు.


