అలీకి మంత్రి పదవి..సీఎం హామీ

 

సినీ నటుడు అలీ ఏ పార్టీలో చేరుతారనే దానిపై సందిగ్దత నెలకొంది. ఇటీవల విమానాశ్రయంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ని కలిసిన ఫోటోలు వైరల్ అవ్వటంతో అలీ వైసీపీలో చేరుతారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వటంతో అసలు అలీ ఏం చేస్తున్నారు, ఏ పార్టీలో చేరతారా అని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈ తరుణంలో అలీ విశాఖపట్నంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అవ్వటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీలో అలీ గుంటూరు నుంచి పోటీ చేయాలని ఉందని, అదేవిధంగా మైనారిటీ కోటాలో మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నట్లు తన మనసులో మాట గంటా వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబును కూడా కలిసి మాట్లాడగా భరోసా ఇచ్చారని, మీ తరఫున కూడా తగిన సహకారం అందించాలని గంటాని అలీ కోరినట్లు సమాచారం. పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టినా తనను ఆహ్వానించలేదని, వైసీపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని గంటాకి వివరించినట్లు తెలుస్తోంది.

కాగా భేటీ అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ.. గంటాతో తనకు ఇరవై ఏళ్లుగా పరిచయం ఉందని, తాను అప్పుడప్పుడు వచ్చి కలుస్తానని చెప్పారు. పార్టీలో చేరికపై మీడియా ప్రతినిధులు అడగ్గా...ఎన్నికల్లో పోటీకి తనకు అవకాశం ఇచ్చిన పార్టీకే జై కొడతానని పేర్కొన్నారు. తనకు ఒక గురువు ఉన్నారని, జనవరి 16 వరకు రోజులు బాగాలేవని ఆయన చెప్పారని, ఆ తేదీ తరువాతే తాను ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని తెలిపారు. టీడీపీ అంటే తనకు అభిమానమని, సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులతో తనకు పరిచయాలున్నాయని, తనను వారు ఓ సోదరుడిలా చూసుకుంటారని తెలిపారు. గతంలో తాను గంటాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాను 20 ఏళ్ల నుంచి కార్యకర్తగానే ఉన్నానని, ఇక అభ్యర్థిగా ఉండాలన్నది తన అభిమతమని వ్యాఖ్యానించారు.

ప్రజలు తనని నటుడిగా ఆదరించి మంచి లైఫ్ ఇచ్చారని, అలాంటి ప్రజలకు ఏదో చేయాలనే తాను పార్టీల ముందు కండిషన్స్ పెట్టానే తప్ప తాను పదవులు అనుభవించేందుకు కాదన్నారు. తనకు గ్రీన్ సిగ్నల్ వచ్చాక క్లారిటీగా చెబుతానని అన్నారు. అలాగే, మంత్రి గంటాకు తాను చెప్పాల్సింది చెప్పానని, ఆయన తనను సిఫారసు చేస్తారని భావిస్తున్నానన్నారు. గంటా వెళ్లి సీఎంకు ఏం చెప్తారో, ఏం సమాధానం వస్తుందో చూడాలన్నారు. అనంతరం మంత్రి గంటా మాట్లాడుతూ.. అలీ గురించి ముఖ్యమంత్రికి తెలుసని, ఆయన ఉద్దేశాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని వివరించారు. తాను కూడా ముఖ్యమంత్రికి చెప్పాల్సినవి చెబుతానన్నారు. గుంటూరు నుంచి పోటీ చేయడానికి అలీ ఆసక్తిగా ఉన్నారని స్పష్టం చేశారు.