నటుడు పుండరీకాక్షయ్య ఇకలేరు
Published on: Thu Feb 2, 2012 8:47AM
చెన్
నై: ప్రముఖ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పుండరీకాక్షయ్య గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా చౌటుపల్లి. ఆయన 1925 ఆగస్టు 19వ తేదిన జన్మించారు. తొలిసారిగా పుండరీకాక్షయ్య భక్తప్రహ్లాద చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పోలీస్ బ్రదర్స్, తోడు దొంగలు, పిచ్చి పుల్లయ్య, పల్లెటూరు, రాజేశ్వరి కళ్యాణం, ప్రాణదాత, జయసింహ, మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, అమ్మలక్కలు తదితర చిత్రాల్లో నటించారు. లేడీ ఆమితాబ్ విజయశాంతి కర్తవ్యం చిత్రంలో ఆయన ముద్దుకృష్ణ పాత్రలో నటించారు. ఈ చిత్రం ఆయనకు ఎంతో పేరు తీసుకు వచ్చింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు, త్రివిక్రమ రావులతో కలిసి ఆయన నేషనల్ ఆర్ట్ థియేటర్స్‌ను ప్రారంభించారు. ఆయన నిర్మించిన చివరి చిత్రం రాఘవయ్యగారి అబ్బాయి. తెలుగులో 20, కన్నడలో ఆరు చిత్రాల్లో పుండరీకాక్షయ్య వివిధ పాత్రలు పోషించారు. ఆయన రచయితగా కూడా పని చేశారు. పుండరీకాక్షయ్య మృతి పట్లు తెలుగు, తమిళ చిత్రసీమ ప్రముఖలు సంతాపం తెలిపారు.


