TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

RRRపై బహిష్క‌ర‌ణ‌ వేటు.. స‌భ‌లో ప్ర‌భుత్వం దూకుడు..

Published on: Mon Mar 7, 2022 11:20AM

ఏసేశారు. ఆ ముగ్గురిపై వేటు వేసేశారు. అంతా అనుకున్న‌ట్టే జ‌రిగింది. ఆ ముగ్గురు మొన‌గాళ్ల‌కు కేసీఆర్ స‌ర్కారు భ‌య‌ప‌డింది. వారు గొంతెత్తితే.. స‌భ‌లో స‌ర్కారును నిల‌దీస్తే.. ప‌రువంతా పోతుంద‌ని.. బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని బెదిరిన‌ట్టున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రారంభ‌మైన మొద‌టి గంట‌లోనే బీజేపీ స‌భ్యులు ముగ్గురిని స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు. రాజాసింగ్‌, ర‌ఘునంద‌న్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్‌ను అసెంబ్లీ నుంచి బ‌హిష్క‌రించారు.

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవగానే ఆర్ధిక మంత్రి హరీష్ 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. బడ్జెట్ కాపీలను చించేశారు. గవర్నర్ ప్రసంగం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. 

దీంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌ రావును సస్పెండ్ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం మంత్రి హరీష్‌ రావు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.

నిర‌స‌న తెలిపితే.. స‌భ వాయిదా వేయ‌డ‌మో.. లేదంటే ఒక‌రోజు స‌స్పెండ్ చేయ‌డ‌మో చేస్తారు కానీ.. ఏకంగా అసెంబ్లీ సెష‌న్ మొత్తం బ‌హిష్క‌రించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది మ‌రీ దారుణ‌మ‌ని.. స‌భ‌లో బీజేపీ గొంతు నొక్కేశార‌ని అంటున్నారు. బీజీపీకి కేసీఆర్ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌ని.. అందుకే వేటు వేశార‌ని క‌మ‌ల‌నాథులు ఆరోపిస్తున్నారు.