సుమలత భర్త అనారోగ్యం: రాజకీయ దుమారం

 

నటి సుమలత భర్త, కన్నడ నటుడు, కర్ణాటక రాష్ట్ర మంత్రి అంబరీష్ అనారోగ్యం కర్నాటకలో రాజకీయ దుమారం రేగటానికి కారణమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్ సింగపూర్‌కి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. ఆయన కర్నాటక రాష్ట్ర మంత్రి కాబట్టి ఆ బిల్లును ప్రభుత్వానికి ఇచ్చాడు. ప్రభుత్వం ఆ బిల్లు మొత్తాన్నీ అణా పైసలతో సహా చెల్లించేసింది. అయితే అంబరీష్ చేసిన బిల్లు ఎంతయ్యా అంటే, అక్షరాలా కోటి పదహారు లక్షలు. అయితే నిబంధనల ప్రకారం ఒక మంత్రి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ఏడు లక్షలు మాత్రమే ఇవ్వాల్సి వుంటుంది. మరి అంబరీష్ ఏకంగా కోటి 16 లక్షలు ఖర్చు చేశారని ప్రతిపక్షాలు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మీద విరుచుకుపడుతున్నాయి. ఏడు లక్షల లిమిట్ మాత్రమే వుంటే, కోటి 16 లక్షలు ఎందుకు ఇచ్చారని, అలాగే కోటీశ్వరుడైన అంబరీష్ ప్రజాధనంతో వైద్యం ఎందుకు చేయించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఏ విధంగా క్లెయిమ్ చేస్తుందని, ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని నిలదీస్తున్నారు.అయితే శాసనసభ్యులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం తరపు రూ. 7లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ, ఇది ప్రత్యేక కేసుగా భావించి ప్రభుత్వం తరపున అంబరీష్‌కు సంబంధించిన వైద్య ఖర్చులను(రూ. కోటి) క్లెయిమ్ చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్పష్టం చేశారు. సామాన్యులకు ఏవైనా ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తారు.. రాష్ట్ర మంత్రులకు మాత్రం విదేశాల్లో వైద్య సేవలు అందించి, వాటికి ఖర్చులు కూడా చెల్లిస్తారా అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.