జగన్ వంటి నేరస్తుడు చట్ట సభలలోనా? హవ్వ..

 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నారు. హూద్ హూద్ తుఫాను బాధితులకు పులిహోర పొట్లాలు చేతికి అందించకుండా విసిరేయడం చాల దారుణమని, మీకు ఆవిధంగా విసిరితే తీసుకొంటారా? అని ప్రతిపక్ష నేత జగన్ ప్రశించారు. ఆయనకు మంత్రులు అచ్చెం నాయుడు, అయ్యన్నపాత్రుడు ఇరువురు కూడా అంతే ధీటుగా జవాబిచ్చారు.

 

తుఫాను వచ్చిన మరునాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు చేరుకొని స్వయంగా వారం రోజులపాటు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించినందుకు నగర ప్రజలందరూ కూడా ఎంతో మెచ్చుకొంటుంటే, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి మాత్రం ఆయనలో తప్పులు వెతకడం చాల దారుణమని అన్నారు. అచ్చెం నాయుడయితే మరీ చేలరేగిపోయారు. పదకొండు చార్జి షీట్లు వెనకేసుకొని కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు గంటలో వస్తానని హామీ ఇచ్చి సభకు హాజరవుతున్న జగన్మోహన్ రెడ్డి వంటి ఒక ఆర్ధిక నేరస్తుడు ఉన్న సభలో మేమూ ఉన్నామని చెప్పుకోవడానికీ సిగ్గు పడుతున్నామని అన్నారు. అటువంటి వ్యక్తి గౌరవనీయులయిన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాదితే సహించబోమని హెచ్చరించారు.

 

అచ్చెం నాయుడు మాటలని వైకాపా సభ్యులు తీవ్రంగా ఖండిస్తూ వాటిని ఆయన వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సభను స్తంభింపజేశారు. ఆసందర్భంగా ఇరు పార్టీల సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకోన్నప్పుడు వారిరువురి మధ్య కొంత తోపులాటలు కూడా జరుగాడంతో స్పీకర్ సభను 40నిమిషాల పాటు వాయిదా వేసారు.