TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 25 వేల ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి.!

Published on: Thu Nov 26, 2026 8:16PM

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. నల్లమల ప్రాంత అభివృద్ధి, పాలమూరు సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటనలు చేశారు.

ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పదర మండలం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుతో పాటు భారీ మండప నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నల్లమల ప్రాంతానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడంతో పాటు పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. కొద్దిమంది కుటుంబాల ప్రయోజనాల కోసం కాకుండా సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తితో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే సామాన్యులకు ఓటు హక్కు లభించిందని, ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ప్రజలు తమ శక్తిని నిరూపించుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి.. ప్రతిపక్షాలపై విమర్శలు.!

దేశంలో 50 ఏళ్ల క్రితం బీజేపీ లేదని, 25 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోనే లేదని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే నేడు లక్షలాది ఎకరాలకు నీరందిస్తున్నాయని పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ముందుచూపుతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, యూనివర్సిటీలు, ఐఐటీలు ఏర్పాటు చేసి దేశానికి విజ్ఞానాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీయేనని కొనియాడారు.

గత పాలకులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, తమ కులం వారికే ఉద్యోగాలు కల్పించుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను, వారి కుటుంబాలను గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం పేదలు, నిరుద్యోగులకు అండగా నిలుస్తోందని, ఇప్పటికే 75 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని వెల్లడించారు.

మరో 25 వేల ఉద్యోగాలు.. 2 వేల హోంగార్డు పోస్టులు.!

నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా త్వరలోనే మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటితో పాటు 2 వేల హోంగార్డు పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల్లో కలిపి లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అచ్చంపేట, మద్దిమడుగు ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సభలో పాల్గొన్నారు. మరోవైపు సీఎం ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ హామీలపై నిరుద్యోగులు, స్థానిక ప్రజల్లో ఆసక్తి నెలకొంది.మొత్తంగా అచ్చంపేటతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభివృద్ధి, సాగునీరు, ఉపాధి, సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వేగంగా కార్యరూపం దాలుస్తాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

మీకు నచ్చవచ్చు: పాల్వంచ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు.!

మీకు నచ్చవచ్చు: కడుపునొప్పి అని ఆసుపత్రికి వెళ్తే ..యువకుడి కడుపులో గర్భాశయం.!  

 

[ Achampet Public Meeting CM Revanth Reddy,  Nagarkurnool District, Sant Sevalal Maharaj, Telangana Government Jobs ]